శ్లో|| అన పేక్షః శుచిర్దక్ష: ఉదాసీనో గత వ్యధః
సర్వారంభ పరిత్యాగీ యోమద్భక్త స్పమే ప్రియః
ఈ గుణములు ఏ మానవుని యందు ఉండునో, అట్టి మానవుడే భగవంతునికి అత్యంత ప్రియుడు. ఇందుమొదటిది. అనపేక్ష అనగా ఎట్టి అపేక్షలు లేకుండా ఉండటం. శరీర మనోబుద్ధులు ధరించిన మానవుడు ఏ అపేక్ష లేకుండా ఉండగలడా? ఇది అసాధ్యము కాని, ఇట్టి స్థితిని ప్రయత్నపూర్వకముగా మానవుడు సాధించ వచ్చును. ప్రపంచములో అనేకమంది అప్పటికప్పుడు ఆనందము నందించే ఇంద్రియ సుఖములను ఆశిస్తూ ఉంటారు. ఇది ప్రేయోమార్గము. దీనికి భిన్నముగా శాశ్వత ఆనందమును అందింపజేసి, ఇంద్రియాతీతమైన సుఖమును అందించి, దివ్యత్వమైన మార్గమును ప్రవేశింప జేయునది ఆత్మానుభూతి. దీనికి శ్రేయోమార్గముని పేరు.
ఈ శ్రేయా మార్గము అందరికీ అర్ధమయ్యేది కాదు. ఇది అందరికీ అందుబాటులో ఉండదు. కనుకనే శ్రేయో మార్గమును ప్రజలు అమితంగా విశ్వసించలేకపోతున్నారు. ఒకవైపున ప్రేయోమార్గము. రెండవవైపున శ్రేయోమార్గము, ప్రపంచమునందున్న ప్రజలను తమతమ వైపునకు మరల్చుకునే నిమిత్తము ప్రయత్నిస్తూ ఉంటాయి. కాని, ఇంద్రియానందమును కోరే ప్రజలు ఈ ప్రేయో మార్గమునే ఆశిస్తూ ఉంటారు.
ఈ భౌతికమైన సుఖమును లెక్కచేయక అనిత్యము, అశాశ్వతము, లోకసంబంధము అయినటువంటి సుఖాలను ఏమాత్రము ఆశించక, నిష్ణులై, ద్రష్టులై, పవిత్రమైన హృదయమును పొందిన ఒక్క జ్ఞానులు మాత్రమే ఈ శ్రేయోమార్గమును ఆశిస్తారు. శ్రేయస్సునకు ప్రేయస్సునకు అతీతమైనటువంటిది మరొక మార్గము కూడా ఉంటున్నది. సమస్త అభీష్టములు ఈశ్రేయస్సునందు, ప్రేయస్సు నందు, అంతర్భూతములై ఉంటాయి. ప్రపంచమునందు గల అభీష్టములన్నింటికినీ ఈ శ్రేయస్సు,ప్రేయస్సు ప్రధానమైన అంతర్వాహినులుగా ప్రవహిస్తుంటాయి.
ఈ రెండింటికీ అతీతమైనదే అనపేక్ష" అనే మార్గము. అనపేక్ష అనగా ఎట్టి అపేక్షలు లేకపోవటము. ఇది సరియైన అర్థముకాదు. మానవుడు చేయు సర్వకర్మలయందు నేను చేస్తున్నాను అనే అహంకారమును, నేను అనుభవిస్తున్నాను అనే అభీష్టమును త్యజించినప్పుడది అనపేక్షగా మారిపోతుంది. ఆచరణందు అహంకారము, అనుభూతి యందాసక్తి ఈ రెండింటిని త్యజించినప్పుడు అనపేక్ష అనునటువంటిది రూపొందుతుంది. ఇట్టి అనపేక్ష హృదయమునందు ఆవిర్భవించిన వ్యక్తిని భగవంతుడు ఐక్యం కావించుకొంటాడు. అట్టి అనపేక్ష కలిగిన వ్యక్తినే భగవంతుడు ప్రేమిస్తాడు. భగవంతుని ప్రేమకు పాత్రుడు కావలెనన్న సర్వకర్మలు, భగవత్ ప్రీత్యర్థం కావించే సేవలలో మనం పాల్గొనాలి. ఎవరికి ఎప్పుడు ఎక్కడ సేవలు చేసినా ఇవన్నీ భగవదర్పితమనే భావములో మనము చేయాలి.
రెండవది శుచి :అనగా శుభ్రత అని. ఇది ఆంతర్, బహిర్ శుభ్రతగా ఉంటుండాలి. శారీరకమైన పరిశుభ్రత లోకసంబంధమైనటువంటిది. స్నానాదులతో దేహమును పరిశుద్ధము గావించుకోవటము, శుభ్రమైన వస్త్రములు, ధరించటము, భుజించే ఆహారమును పరిశుద్ధముగా ఉండేటట్లు చూసుకోవటం, వండే వంటల యందు పరిశుభ్రతను అభివృద్ధిగావించుకోవటము, పదార్ధశుద్ధి, పాత్రశుద్ధి, పాకశుద్ధి మొదలగునవి మనం కొంతవరకు గమనించాలి.
నిజానికి నిత్యజీవితంలో మానవుడు అనుభవించే ప్రతి పదార్థము పరిశుద్ధముగా ఉంచుకోవాలి. ఇది భౌతికమైన పరిశుభ్రత, ఈ పరిశుద్ధములు ఎన్ని ఉండినప్పటికీ అంతర శుద్ధియే లేకపోయిన ఇవి నిరుపయోగము అవుతాయి. పండితుని మొదలుకొని పామరుని వరకూబాహ్యమైన పరిశుద్ధత కొరకే పాటు పడుచున్నారు గాని, అంతఃశుద్ధికి ఏమాత్రము పాటుబడటం లేదు.
వంటపాత్రను ఎంత పరిశుద్ధంగా తోమి పెట్టినప్పటికినీ, ఆ పాత్రకు కళాయి లేకపోయిన, అందులో వండేటటు వంటి పదార్ధమంతయు నిరుపయోగమవుతుంది. కనుక, హృదయమనే పాత్రను పరిశుద్దము కావించుకోవటమే ప్రధానమైన సాధన. దీనిని పరిశుద్ధము చేసుకొనుటకు స్వార్థరహితమైన సేవలో మనము ప్రవేశించాలి. రాగద్వేషములచేత మనోబుద్ధులు మాలిన్యమవుతాయి. ఇట్టి శుద్ధమైన మనో బుద్ధులను స్వార్థరహితమైనసేవల ద్వారా మనము పరిశుద్ధము గావించాలి. మనోబుద్ధులు పరిశుద్ధముగా ఉండినపుడే నిష్కామ సేవలో పాల్గొనగలము,మనోబుద్ధులు అశుద్ధంగా ఉండినప్పుడు, మనం చేసే కర్మలు కూడా శుద్ధంగానే రూపొందుతాయి. శారీరక, మానసిక పరిశుద్ధతలు మానవుడికి ప్రధాన కర్తవ్యాలు.
మూడవది నిష్ణ",అనగా ప్రతి మానవుడు తన జీవితములో ఒకనిష్టను పూనాలి. ఉన్నంత వరకూ పవిత్రమైన కార్యములలో ప్రవేశించి, ప్రజాసేవలో మనము పాల్గొని తద్వారా పుణ్యకార్యములను మనము చేయాలనే భావము ప్రతి మానవుని యందును ఆవిర్భవించాలి. ప్రజా సేవ చేత మానవుని యొక్క ఏకత్వ భావాన్ని పొందవచ్చును అనే విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవాలి. సంఘ సేవద్వారా ఏకత్వము ప్రాప్తిస్తుంది. ఏకత్వము ద్వారా దివ్యత్వము పొందవచ్చు. ఈ దివ్యత్వమును పొందటమే పవిత్రమనిభావించాలి. ప్రతి మానవుడు తాము జీవించినంత కాలము "పరోపకారార్థమిదం శరీరం" ఈ శరీరము పరోపకార సంబంధమైనదనే భావమును తప్పక గుర్తించి విశ్వసించాలి. ఎల్లప్పుడూ స్వార్థము, స్వప్రయోజనము ఈ రెండింటి యందే మానవుడు లీనమైపప్పుడు, ఇంక పరార్ధమనే యదార్ధ తత్వాన్ని ఏరీతిగా గుర్తించగలడు? స్వార్ధాన్ని త్యాగం చేయాలి. ఈ త్యాగం చేయాలనుకుంటే సమాజ సేవలో పాల్గొనాలి. ఈ సమాజ సేవలో అహంకారమునిర్మూలనమవుతుంది. ఏకాత్మ భావము ప్రాప్తిస్తుంది. కనుక, ఇటువంటి దీక్షను పూనినవాడు భగవంతునికి పరమ ప్రీతి పాత్రుడు కాగలడు.
నాలుగవది "ఉదాసీన: అనగా సుఖదుఃఖములను గాని, మంచి చెడులనుగాని. కీర్తి ప్రతిష్టలను గాని, లెక్కచేయనక్కర లేదు. నీవు చేసే కర్మలు పవిత్రమైనవా? కావా? అని మనస్సాక్షిగా గుర్తించాలి. ఇది మంచి కార్యము, ఇది పవిత్రమైన కార్యము, సమాజసేవలో ఇది సరియైన సేవ అని విశ్వసించినవారు ఏ విషయమునందు లెక్కచేయ నక్కరలేదు.
మంచి కార్యములలో మానవుడు ప్రవేశించినప్పుడు అనేక విధములైన ఆటంకములు వస్తూ ఉంటాయి. ఇతరులు ద్వేషించవచ్చును. ఇతరులు హాస్యాస్పదము చేయ వచ్చును. వాటినన్నింటినీ మనము లెక్కచేయనక్కరలేదు. నీ హృదయానికి నీవు సాక్షిగా నిలవాలి. నేను చేయునటువంటి కర్మ మంచిదా? లేక చెడ్డదా? అనే విచారణ చేసి ఆ పరిశీలనలో నీవు దానిని పరీక్షించుకోవాలి. అది మంచిదని నీ అంతర్వాణి భోదించినప్పుడు, ఎవ్వరు ఏమి చెప్పినా నీవు లెక్కచేయనక్కరలేదు. బంధువులు కానీ, మిత్రులు కానీ తల్లిదండ్రులు కానీ, ఎవ్వరైనా దీనికి అడ్డుతగిలినప్పటికీ నీవు మాత్రము లెక్కచేయకు. ఈ విధమైన దీక్షను పూనినపుడే ఈ ఉదాసీన భావము కలిగినప్పుడే నీవు సంకల్పించిన దానిని పూర్తిగా సాధించగలవు. ప్రతికార్యమందు నీవు అదరి, చెదరి, బెదరి ఉంటుంటే ఏమాత్రము విజయాన్ని సాధించలేవు. కనుక, ఉదాసీన భావముతో లౌకికమైన జగత్తునకు అతి దూరంగా ఉండి, మానసికమైన ప్రేమచేత సమస్త మానవులకు సేవ చేయడానికి తగిన కృషి చేయాలి. ఈ ఉదాసీనమనే విషయం లోపల అనేక విధమైన భావాలు మనలో ఆవిర్భవించవచ్చు. కాని, ఉదాసీనత అనగా ఏమీ లెక్కచేయకుండా, అహంకారముచేత, లేక ఆడంబరము చేత, గర్వముచేత, పొగరుబో తుతనము చేత చెడిపోవటము కాదు. మంచిని అనుసరించి చెడ్డను లెక్క చేయక పోవటమే ఉదాసీనత.
ఐదవది గత వ్యధః అనగా గడచిపోయిన దానికి మనము చింతింపనక్కరలేదు. మనో కలత చెందినవాడు ఎట్టి కార్యములలోనూ పాల్గొనలేడు. ఈ మానసిక కలత మానవునకు ఏ మాత్రము ఉపకారము చేయదు. ఎప్పుడో గడచిపోయిన విషయాన్ని మనము చింతించి ప్రయోజనము లేదు. ఎప్పుడో రాబోయే విషయాన్ని గురించి మనము చింతించకూడదు. కనుక గతమును, భవిష్యత్తును విస్మరించి వర్తమానము నందే లక్ష్యమును అభివృద్ధి పరచుకోవాలి. ఈనాడు ప్రపంచములో సమస్త దుఃఖములకు మూలకారణమిదియే. నేటి మానవుడు ఉన్నదానిని వదిలి, లేనిదానిని ఆశించి, గడచిన దానికి చింతించి, లేని దుఃఖమును తెచ్చుకుంటున్నాడు. గడచినది. గడచినది. ఎంత ప్రయత్నము చేసిననూ ముందుకు రాదు. భవిష్యత్తు మనకు కనిపించదు. కనిపించని దాని నిమిత్తమై నీవు ప్రయత్నము చేయటము కేవలము వెర్రితనము. వర్తమానమును లక్ష్యములో పెట్టుకొని మనఃశుద్ధిగా నీవు కార్యములో పాల్గొనాలి. వర్తమానకాలము నందే గతము, భవిష్యత్తు ఇమిడి ఉంటాయి. నీవు వర్తమానమును సరియైన దృష్టియందుంచుకొని, పవిత్రమైన భావములలో పవిత్రమైన కార్యములలో పాల్గొనాలి. అట్టివాడు భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రుడు, అత్యంత ప్రియుడు కాగలడు.
ఆరవది సర్వారంభపరిత్యాగి" అనగా ఆడంబరములలో మనము ఎట్టి కార్యములను ఆచరించరాదు. అహంకారము ఉండినంత వరకూ ఆడంబరము చావదు. ఆడంబరము చావకుండా చిత్తశుద్ధి కలుగదు. చిత్తశుద్ధి లేనివాడు పవిత్రకార్యములు ఆచరించలేడు. పవిత్రకార్యముల వలననే చిత్తశుద్ధి లభిస్తుంది. "చిత్తస్య శుద్ధయే కర్మ కనుక చిత్తశుద్ధిని గావించే కర్మలే మానవులు ఆచరించాలి. ఆడంబరమనేది మానవునికి ఒక రాక్షసగుణము వంటిది. ఈ రాక్షస గుణము నందు, రాగద్వేషములు, మోహము అమితంగా అభివృద్ధి అవుతాయి. ఏది చేసినా వినయ విధేయతలతో కార్యములలో పాల్గొనాలి. ఇది నా కర్తవ్యం, సేవ నిమిత్తమై అందించినదీ దేహం. అనే పరిపూర్ణ విశ్వాసంతో సేవలో పాల్గొనాలి. అట్టివాడు భగవంతునకు అత్యంత ప్రీతిపాత్రుడు, అత్యంత ప్రియుడు కాగలడు.
(శ్రీ. భ.ఉ...పు.16/19)