విద్యార్థులారా! మీ ఇనిస్టిట్యూషన్స్ ఒక్కొక్కదానికి ఒక్కొక్క సిల్వర కప్పును ప్రైజుగా ఇస్తున్నాను. ఇవి కేవలం సంస్థలకు ఇచ్చినానని అనుకోకండి. ఎవరికి వారు స్వామి నాకే ఇచ్చారని భావించి ఆనందించండి. ఫండమెంటల్ లవ్ ను పెంచుకోండి.ఇండివిజువల్ లవ్ కాదు. నీవు, నేను, వారు అందరూ చేరి ఒక్కటే అనే ఏకత్వాన్ని మీరు అభివృద్ధి పర్చుకోవాలి. ఈ నాడు ప్రపంచమంతా ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించుకొని అశాంతికి గురియవుతున్నది. మీరీ ప్రపంచంలో ప్రవేవించి ఆనేకత్వాన్ని ఏకత్వంగా మార్చుటకు ప్రయత్నించాలి. అదే మీరు నాకివ్వవలసిన, ప్రైజు, మీరందరూ నా ప్రాపర్టీ, నేను మీ ప్రాపర్టీ. కాబట్టి నన్ను మీరు పంచుకోండి. నేను మిమ్మల్ని పంచుకుంటాను. భక్తి పేరుతో పూజలు, వ్రతాలు, భజనలు చేస్తే చాలదు. "దైవం నావాడు" అనే హక్కును మీరు సంపాదించాలి.దైవం నావాడని నీవనుకొన్నప్పుడు దాని రిప్లేక్షన్, రియాక్షన్, రీసౌండ్ ఫలితంగా దైవం నీవు నావాడవు" అంటాడు. కనుక నన్ను మీవాడుగా భావించుకోండి. సహజంగానే మీరు నావారుగా వచ్చేస్తారు. మీకు తెలియదుగాని మొన్న క్రికెట్ మ్యాచ్ ఆడడానికని ఇక్కడకు వచ్చిన ఒక ఆటగాడు నాతో ఒక మాట చెప్పాడు. అతడు ఇక్కడకు వచ్చిన తరువాత అతని పని విజయవంతమైనదని ఒక టెలిగ్రామ్ వచ్చింది. అప్పుడతడు "స్వామీ! నా పని నేనేమీ చేసుకోలేదు. ఇది స్వామిపని అనుకొని ఇక్కడకు వచ్చేశాను. నేను స్వామి పని చేశాము, స్వామి నా పని చేశారు" అన్నాడు. కనుక మీరు స్వామి పనులన్నీ చేయండి, మీ పనులన్నీ నేను చేస్తుంటాను. ప్రతి కర్మను దైవకర్మగా విశ్వసించండి.
(స.పా.ఫి.98పు.45)