గోవుల కొట్టములోనికి పులులు ప్రవేశించిన, యెంత ప్రమాదము! గోవులెట్లు జీవించును? సహజముగానే దైవ సంపత్తికి సంబంధించిన, సత్య ధర్మ శాంతి ప్రేమలనే గోవులు నివసించే హృదయమనే కొట్టములోనికి, అజ్ఞానముచే మానవులు, ద్వేషము అసూయ, లోభము, హింస, కోపము, మదము, మాత్సర్యము అనే దుష్ట మృగములను ప్రవేశపెట్టిన. పరిస్థితి ఏమగును? శాంతి ఎట్లు సిద్ధించును? ఈ నాడు మానవుని హృదయ స్థానమందు సాత్విక గుణములకు స్థానమే లేకుండా పోయినది; దానిని రజోగుణ సంబంధమైన అశాంతి కారకమైన ద్వేషాసూయలే అక్రమించినవి.
(స. సా.మే.75 పు.62)
ఒక వేదాంతి నాదగ్గరకు వచ్చాడు. స్వామి బ్రహ్మసత్యం జగన్మిధ్య అని శంకరాచార్యులవారు జెప్పారు. కదా! ప్రత్యక్షముగా కనుపిస్తుంది. ప్రత్యక్షముగా అనుభవిస్తున్నాము. జాగ్రత్ స్వప్నసుషుప్తులయందు జీవిస్తున్నాము. ఇది మధ్య ఎట్లా అవుతుంది? అని ప్రశ్నించాడు. నాయనా ప్రపంచము మిధ్య అనేది ప్రపంచమునకు వదలిపెట్టు. మొట్టమొదట నీవు సత్యమామిథ్యయా కనుక్కోమన్నారు. మొట్టమొదట ఎవనికివాడు సత్యమా మిథ్యయా అని గుర్తించుకుంటే ప్రపంచగుణము గుర్తించుకున్నవాడౌతాడు. ఈనాటి విద్యార్థులు అంతే. తన తత్వమేమిటో తాను గుర్తించటానికి ప్రయత్నించటం లేదు. విదేశముల విషయాలన్ని వినాలని కోరుతారు. ఆదేశములో ఏమి జరుగుతుండాది? యీ దేశములో ఏమి జరుగుతుండాది. పరదేశముల విషయాన్ని చూస్తున్నావు గాని నీదేహములో ఏమి జరుగుతున్నాది అని గుర్తించటానికి ప్రయత్నిస్తున్నావా? బయట నుంచి వచ్చిన నూస్ అందుకుంటున్నావు. నీ నుండి వచ్చే న్యూసెన్స్ ను నీవు గుర్తించటం లేదు. మొట్టమొదట నిన్ను నీవు గుర్తించుకో, నిన్ను నీవు చక్కబరచుకో, ఆ తరువాత యితరులను చక్కబరచటానికి ప్రయత్నించు. ఇది మొట్టమొదట విద్యార్థులు గుర్తించవలసిన విషయము. కనుక భ్రమచేత ప్రమాదము సంభవిస్తుంది.
(బృత్ర.పు.87/88)
(చూ॥ నియమములు, ఇంద్రియములు, ప్రాణాయామము)