ప్రణవమే పరతత్త్వము, ప్రణవమే పరమాత్మ, ప్రణవమే సర్వస్వము. దీనిలో మూడు విధములైన శక్తులున్నవి. 1. నాదము 2 బిందువు 3. కళ,నాదమనగా ఏమిటి? పంచప్రాణములైన - ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములన్ని ఒక్క తూరి చేరి నప్పుడు ఏవిధమైనఘోష ఏర్పడుతుందో అదే “నాదము", ఇది నాశరీరము, ఇది నా ఇంద్రియము, ఇది నా మనస్సు అనే భేదము లేక, శరీర మనో ఇంద్రియములందు శుద్ధసత్వమైన బుద్ధి కల్గిన తత్త్వమే బిందువు. ఈ శుద్ధసత్వమైన బుద్ధియందుప్రతిబంబంచే పరతత్త్యమే - "కళ”. భగవంతుడు కళాస్వరూపుడు. సర్వకళలూ అతని నుండే ఆవిర్భ వించినవి. కళ అనగా ఏమిటి? సమస్త సృష్టి కళయే! సృష్టి కళాస్వరూపము! కనుక కళ అనేది ఆత్మకు మాత్రమే సంబంధించినది!
"నచికేతా..! శరీరము నశించునది, ఆత్మ నశించనిది. నశించిన ఆత్మ నశించే ఈ దేహమునందే ఉంటున్నది. కనుక ఈ నశించే దేహాన్ని అలక్ష్యం చేసుకోవద్దు. ఎంత వరకు? నశించని ఆత్మను గుర్తించే వరకు - నశించే దేహాన్ని సంరక్షించుకోవాలి. మానవత్వంలో పరతత్త్వము ఏకమై ఉన్నదేకాని, భిన్నంగా లేదు" అన్నాడు యమధర్మరాజు. దీనికొక చక్కని ఉపమానమును చెపుతూ వచ్చాడు. జీవాత్మ పరమాత్మల సంబంధము ఎండ నీడల వంటిది అన్నాడు. ఎండలేక నీడలేదు. నీడలో ఎండ కొంత ఆరూపకంగా కనిపిస్తుంది. నీడలు వేరు వేరుకాని, ఎండ ఒక్కటే...!. కనిపించే నీడలలో భేదములుంటున్నాయి కాని, సూర్యునిలో భేదము లేదు. అనంతమైన సముద్రంలో అలలు ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి కాని, అన్ని సముద్రం నుండి ఆవిర్భవించినవే...! అదేవిధముగా, జీవులందరూ సచ్చిదానందమనే సముద్రము నుండి ఆవిర్భవించినవారే.... అందరి యందున్న ఆత్మతత్త్యం ఒక్కటే...! ఇది ప్రతి మానవుని యందు ప్రణవస్వరూపములో ఉన్నది. మానవుడు నిద్రిస్తున్నప్పటికీ ఈ ప్రణవము నిద్రించదు. అనగా ఏమిటి? ఇది ఉచ్చ్వా స నిశ్వాసల రూపంలో గుర్తింపజేస్తున్నది. ఈ ప్రణవము దేహాన్ని వదలినప్పుడు జీవతత్త్యమే లేదు.
ఈ ప్రణవము మానవుని యందు అనేక విధములైన శబ్దరూపములతో కనిపిస్తుంది. దీనినే శబ్ద బ్రహ్మము అన్నారు. ఇది చరాచర ప్రపంచమంతా ఉంటున్నది. ఈ శబ్దమునకు రూపమేమిటి? జ్యోతిర్మయమే దీని రూపం. ఈ జ్యోతిర్మయమనేది వాక్ రూపములో ఉంటున్నది. వాక్కును అదుపులో పెట్టుకొంటే మిగిలిన ఇంద్రియము లన్నీ సులభంగా వశమైపోతాయి. మొట్టమొదట వాక్కును మనస్సులో చేర్చాలి. అప్పుడు వాక్కు నిల్చిపోతుంది. కాని, మనస్సు మాట్లాడుటకు ప్రయత్నించినప్పుడు బుద్ధి దానికి బుద్ధి చెప్పి shut-up (నోర్ముయ్!) అంటుంది. ఎప్పుడైతే బుద్ధి మనస్సు యొక్క శబ్దాన్ని అణగదొక్కుతుందో - అప్పుడు అందులో ఆత్మతత్త్వముపరిశద్ధంగా ప్రకాశిస్తుంది. బుద్ది శుద్ధమైన అద్దము వంటిది. దీని యందు ఆత్మతత్త్వము చక్కగా ప్రకాశిస్తుంది. వాక్కు కంటే అతీతమైనది మనస్సు, మనస్సుకంటే గొప్పది బుద్ధి, బుద్ధికంటే పైస్థాయిలో ఉన్నది. ఆత్మతత్త్వం."నచికేతా...! నీ యందే ఉండిన పరతత్త్యాన్ని నీవు తెలుసుకోవాలని కోరుకోవటం చాలా వెఱ్ఱితనం" అన్నాడు యముడు.నీవే పరతత్త్వంగా ఉంటున్నావు. నీ పరత త్త్వన్ని నీవే విధంగా తెలుసుకోగలవు? మానవునికి ముఖము ఉన్నది, లేదని ఎవ్వరూ చెప్పరు. కాని, తన ముఖమును తానే చూడలేకపోతున్నాడు. ఐతే, ముందు అద్దమును పెట్టుకొంటే తన ముఖమును తాను చూడగలుగు తున్నాడు. అదేవిధంగా, తన యందే ఉన్న పరతత్త్వాన్ని చూడాలనుకొన్నప్పుడు - బుద్ధిని పరిశుద్ధమైన రీతిలో తన ఎదురుగా పెట్టుకొన్నప్పుడు దాని ద్వారా ప్రతిచింబము గోచరిస్తుంది. కనుక, ఈనాడు మనం చేయవలసినది ఏమిటంటే - బుద్ధిని పరిశుద్ధం గావించుకోవడమే...! ఈ "అద్దము" ను పరిశుద్ధము గావించుకోవడానికి దివ్యమైనప్రేమతత్తవము కావాలి. అద్దము (Glass) వెనెక రసాయనము పూసినప్పుడే -మన ప్రతిబింబము అందులో కనిపిస్తుంది. వట్టి అద్దములోకి చూస్తే అవతల వైపునున్న పదార్థం కనిపిస్తుంది కాని, మన ప్రతిబింబము మనకు కనిపించదు. అదేవిధంగా నీకు పరిశుద్ధ మైన బుద్ధి ఉన్నప్పటికీ అందులో బయటివారి స్వరూపాలు కనిపిస్తాయి కాని, నీ స్వరూపము నీకు కనిపించదు. అందువల్లనే. ఈనాడు ప్రతి వ్యక్తి పరుల దోషములనే వెతుకుతున్నాడు. కాని, తన దోషాన్ని తాము వెతకటం లేదు...! కనుక, ఈ బుద్ధి అనే అద్దానికి రెండవవైపునప్రేమ అనే రసాయనాన్ని " పూస్తే అప్పుడు తననే తనకు కనిపిస్తాయికాని, బయటవి కనిపించవు. అనగా తనను తాను గుర్తించాలంటే ఒక్క ప్రేమతత్త్వం తప్ప అన్యమార్గంలేదు.
ప్రణవమే సర్వమునూ ఆధారము, ఆ ప్రణవము నీలోనే ఉంటున్నది. జాగ్రత్ స్వప్న సుషుప్తి తురీయావస్థలనేనాలు పాదములు కూడను ప్రణవము నందే ఉంటున్నది. అకార ఉకార మకారములు మూడూ చేరి ఎప్పుడే - "ఓం" అనే ప్రణవశబ్దము నాల్గవదిగా వస్తుంది. అ కారమే విశ్వస్వరూపము. ఈ అ కారము అక్షర సంఖ్య ప్రధానమైనది. ఇది అతి సులభంగా ఉచ్చరింపబడేది. అనగా, మన మీ విశ్వాన్ని సులభంగా ప్రేమిస్తున్నాము,సులభంగా అనుభవిస్తున్నాము. రెండవది ఉ కారము. దీనిని ఉచ్చరించాలంటే కొంచెం నోరు తెరవాలి, ఇది కొంత శ్రమతో కూడినది. ఇది స్వప్నావస్థకు సంబంధించినది. స్వప్నావస్థలో దేవిని చూడగలుగు తున్నావు? జాగ్రదవస్థ ప్రతిబింబాన్నే! నీవు ఏనాడూ చూడనివి, జాగ్రదవస్థలో లేనివి స్వప్నంలో చూడటానికి వీలుకాదు. జాగ్రదలో ఉండినవే స్వప్నములో వస్తున్నాయి. అనగా, వశ్యుడే తేజసుడుగా కనిపిస్తున్నాడు. తేజస్సనగా ఏమి? తనను తాము సృష్టించుకొనేది తేజస్సు. నీవు పరుపు పైన పడుకొంటే రాత్రి నీకొక స్వప్నము వచ్చింది. అందులో నిన్ను, నీ ఇంటిని, నీ స్నేహితులనందరిని నీవే సృష్టించుకొన్నావు. ఎవ్వరూ వచ్చి అందులో చేరలేదు. తెల్లవారిన తరువాత నీవు నీ స్నేహితుని వద్దకు వెళ్ళి "ఒరేయ్! నీవు రాత్రి నా స్వప్నంలో వచ్చావు. కదా!" అంటే - "అబ్బే! నాకేమి తెలుసురా" అంటాడు. అనగా, స్వప్నములో ఆంతటినీ నేవే సృష్టించుకొంటున్నావు. సర్వదుఃఖము లనూ, సర్వానందములమా నీవే సృష్టించు కొంటున్నావు. ఈ స్వప్నావస్థ యొక్క స్వరూపమే - ఉ కారం, ఉకారమనగా ఏమిటి? "ఉత్తది" అని అర్థము. అనగా ఏమీ లేనిది. స్వప్నములో నీవు ఎన్నో బాధలుపడి ఎంతో ఏడ్చినావు. కాని, జాగ్రత్తకు వచ్చేటప్పటికి ఆ ఏడుపులేదు, ఆ చూసినవి కూడా లేవు. "కలలో చూసిన మేడలు మిద్దెలు కన్నులు విప్పిన లేవు కదా!" కలలో అన్ని చూసావుకాని కన్నులు విప్పితే ఏమీ కనిపించటం లేదు. ఇంక మకారమనేది - "ప్రజ్ఞ" ఈ మ అనేది మమత్వాన్ని పెంచుతుంది. ఇది పోయినప్పుడే - బ్రహ్మతత్తవము ప్రాప్తమౌతుంది. కైక తన పుత్రుని పైగల వాత్సల్యముచేత రాముని అరణ్యానికి పంపించింది. కాని, తరువాత తన దోషమును తాను గుర్తించి, రాముడు లంకనుండి తిరిగి వచ్చిన తరువాత - నాయనా! నేను నిన్ను చాలా బాధలు పెట్టాను! అట్టి పాపపరిహారార్థమై నాకొక మంత్రోపదేశం చేసి తరింపచేయి." అని కోరింది. “అమ్మా! సరయూనదికి వెళ్ళి స్నానం చేసి అక్కడ పరిస్థితిని చూసుకొనిరా! నేను మంత్రోపదేశము చేస్తాను" అన్నాడు. కైకేయి సరయూనదికి వెళ్ళి స్నానము చేసింది. అక్కడ రెండువైపులా ఉన్న పచ్చిక బయళ్ళలో గొలు, మేకలు - "మే........ మే… " అని అరుస్తున్నాయి. కైక రాముని వద్దకు తిరిగి వెళ్ళి - "రామా...! నేను సరయూనదిలో స్నానం చేసి సంపూర్ణమైన విశ్వాసంతో ని ఉపదేశాన్ని అందుకోవడానికి వచ్చాను" అన్నది "అమ్మా.... సరయూనది తీరంలో ఏమైనా జంతువులను చూసావా... అని అడిగాడు. రాముడు. "ఆ...చూసాను! అటువైపున మేకలు, ఇటువైపున గొఱ్ఱెలు మేస్తున్నాయి" అన్నది. "అవి ఏమంటున్నాయమ్మా...." అని రాముడు ప్రశ్నించగా, "మే..... మే”.! అంటున్నాయి" అని సమాధానం చెప్పింది కైక. "దానిని వదులు! అదే నీకు ఉపదేశము" అన్నాడు రాముడు. దీని అంతరార్థమేమిటి? మే-అనగా "నేను" ఈ "నేను" అనే అహం ప్రతి మానవుని యందుంటున్నది. ఈ "నేను" అనేదానిని ఆత్మగా భావిస్తే అదే ఉపదేశము. కాని, దానిని దేహముగా భావిస్తే అదే - బంధనము.
"నచికేతా..! నీవు బాలుడవు! బాల్య చాపల్యము వర్ణనాతీతమైనది. కనుక, నీవు బ్రహ్మచర్య వ్రతమును అనుభవించాలి" అన్నాడు యముడు. దీని అర్థమేమిటి? ఈ కలియుగ ప్రభావము వలన- "బ్రహ్మచారీ సహస్ర మర్కటః" అన్నారు. వేయి కోతుల బుద్ధి బ్రహ్మచారిలో ఉంటున్నదట!! కనుక, ఈ వేయి కోతుల బుద్ధిని భగవంతుని వైపు మరల్చాలి. దీనికి వయస్సు ప్రధానం కాదు. ధ్రువుడు ఆరు సంవత్సరముల పిల్లవాడైనప్కుపటికీదైవనుగ్రహమును పొందాలని బయలు దేరాడు. మధ్యలో నారదుడు ఎదురైనాడు. నారదుడనగా చాడీలు చెప్పేవాడని, జగడాలు పెట్టేవాడని మనము అనుకుంటున్నాము. ఇది చాలా పొరపాటు. నారదుడు జ్ఞానస్వరూపుడు. దోషములను నిర్మూలించి జ్ఞానాన్ని బోధించే వాడు నారదుడు. అట్టి నారదుడు ధ్రువునకు సాక్షార్కరించి అతని మనస్తత్వాన్ని పరీక్షించాలని ప్రయత్నించాడు. ప్రతీ దానికి పరీక్ష అత్యవసరము. ఎంత త్వరగా పరీక్ష వస్తుందో అంత త్వరగా మనము ఉన్నత స్థాయికి పోవచ్చును. ప్రతి సంవత్సరమూ పరీక్ష పెట్టడం చేతనే విద్యార్థి ఒక క్లాసు నుండి పైక్లాసుకు పోగల్గుతున్నాడు. కాని, దురదృష్టవశాత్తు ఆధ్యాత్మిక మార్గంలో - "భగవంతుడా...! నన్ను పరీక్షించ వద్దు" అని కోరుకుంటారు. ఇది చాలా పొరపాటు. టెస్టు చేసే తీరాలి. టెస్టు చేస్తేనే రెస్టు కుదురుతుంది. వైద్యుడు రోగికి అన్ని టెస్టులూ చేసిన తరువాతనే రోగానికి తగిన మందునిస్తాడు. వైద్యుడెంతబాగా టెస్టు చేస్తే రోగి అంత తృప్తి పడాలి. కనుక, దేవుడు నాకు ఇన్ని కష్టాలు పెడుతున్నా...! నన్నింత శోధిస్తున్నాడే..!! అని అనుకోవడం చాలా పొరపాటు. అది తప్పు! "భగవంతుడా...! నన్ను త్వరగా టెస్టుచేసి ఉన్నత స్థాయికి పంపించు" అని కోరుకోవాలి. కనుకనే నారదుడు ధ్రువుని టెస్టు చేసాడు. "నాయనా...! నీవు చిన్నవాడవు! కౄరమృగాలు సంచరించే ఆడవిలో ఏరీతిగా జీవించగలవు? నీ ఆహారం మాటేమిటి? చెట్టు నెక్కి ఫలములను కోసుకోవడం కూడా నీకు చేతకాదే...!!" అంటూ నారదుడు భయపెట్టాడు. అప్పుడా పిల్లవాడు - "నారదా...! భగవంతుడు సర్వాంతర్యామి కదా! అతడే నన్ను పోషిస్తాడు. అతడే - నన్ను రక్షిస్తాడు. ఒకవేళ రక్షించడానికి ఇష్టం లేకపోతే నన్ను శిక్షిస్తాడు. కనుక ఉన్నవి రెండే రక్షించుట శిక్షించుట, వీటన్నింటికీ సిద్ధంగా ఉన్నాను" అన్నాడు. నారదుడు. అతని ధైర్యసాహాసాలకు మెచ్చి- "నాయనా..! నీవు దిగ్విజయము సాధింతువు గాక!" అని ఆశీర్వదించి, మంత్రమును ఉపదేశం చేసి పింపించాడు.
ఆదే విధంగా, యముడు కూడా నచికేతుని ఎంతోపరీక్షించాడు. అనేక సమస్యలను అతని తలలో దూర్చాడు. కాని, నచికేతుడు దేనిని చేర్చుకోలేదు. అతని సంకల్పము ఒక్కటే! నాకు భగవంతుడు తప్ప ఏమీ అక్కరలేదు. ఆ పరతత్త్వాన్ని నేను అనుభవించాలి. ఇంక నీవేమైనా చెప్పుకో.." అన్నాడు నచికేతుడు. చలించని మనస్సు, భ్రమించని దృష్టి-ఈ రెండూ కుదిరాయి నచికేతునకు! అప్పుడు వాక్కు స్తంభించి మనస్సులో చేరింది, మనస్సు బుద్ధిని అనుసరించింది. బుద్ధి ఆత్మలో ప్రవెశించింది. బుద్ధికి, మనస్సుకు మధ్యలో ఒక అడ్డుగోడ ఉన్నది. ఏమిటీ అడ్డుగోడ? అదే ప్రకృతి ఆనే తెర. అదే దేహభ్రాంతి. ఆ దేహభ్రాంతిని వదలినప్పుడే పరతత్త్యం మనకు అర్థమవుతుంది. దేహతత్యం ఒక వైపున, పరతత్త్యం మరొక వైపున ఉంటుంటే మన కే మాత్రమూ అర్థంకాదు. ఇది చాలా ప్రమాదం కూడా..! రెండు గుజ్జాలపై స్వారీ ఎవరు చేయగలరు? చేయటానికి వీలుకాదు. కనుక, నీవు ప్రకృతినే పరమాత్మగా భావించుకో... తప్పులేదు! లేకపోతే పరమాత్మనే ప్రకృతగా భావించుకో..... తప్పులేదు! కాని ప్రకృతివేరు, పరమాత్మ వేరు అని భావించుకోవద్దు. "సర్వం విష్ణుమయం జగత్" ఇట్టి ఏకత్వాన్ని నచికేతునకు చక్కగా బోధిస్తూ వచ్చాడు యముడు.
నచికేతుడు ఇంకా సందేహం తీరలేదు! “పరతత్త్యం మనేది చాలా కఠినమైనదే..! ప్రణవోపాసన చాలా కష్టమంటారు కదా..!! కాని, ఈ యమధర్మరాజు ఇంత సులభంగా చెపుతున్నాడే...." అనుకొన్నాడు. ఐతే ప్రణవోపాసన కంటే సులభమైన సాధన మరొకటిలేదు. ఎందుకంటే అన్నింటికీ ఆధారము అదే .... మననఖశిఖ పర్యంతము సంచరించేది ప్రణవమే...! ఈ ప్రణవమే సర్వమునకు ఆధారము. ఒక చిన్న ఉదాహరణ: జాగ్రదవస్థ యందు మనకు విశ్వస్వరూపము కనిపిస్తుంది. ఇక్కడ మన శ్వాస ఏరీతిగా జరుగుతున్నది? "సోఽహం ... సోఽహం...." అంటూ మన ఉచ్చ్వాస నిశ్వాసలు సంచరిస్తున్నాయి. కాని, నిద్రావస్థలోకి పోయేటప్పటికి - ".సో." అనే దాంట్లో “స”కారము మైనస్ అవుతుంది: "హం..." అనే దాంట్లో "హ”కారము మైనస్ అవుతుంది. ". సో"లో“స” కారము లేనప్పుడు అది ఓ అవుతుంది. హం.."లో - "హ”కారము లేనప్పుడడు అది మ్ అవుతుంది. ఈ రెండూ చేరితే అది - "ఓమ్" అవుతుంది. చాలా మంది నిద్రించే సమయంలో గురక పెడుతుంటారు. నీవు ఈ ఓంకారమును ప్రత్యేకముగా వినాలంటే - అక్కడ కూర్చొని విను. ఆ గురక పెట్టేవాడు. “ఓమ్.." అనే శబ్దమును చేస్తుంటాడు కాని, " సోఽహం"అని పలుకడు. అయితే, నోరు తెరిచి గురక పెట్టే సమయంలో ఆది కొంత వికారాన్ని పొందుతుంది.
భగవంతుడు మనకు ఇంద్రియములను ఎందుకిచ్చాడో ఎవ్వరూ అర్థము చేసుకోవడం లేదు. దీన్ని చూడ వద్దు, దాన్ని చూడ వద్దు. ఇది విన కూడదు, అది విన కూడదుఅని స్వామి చెపుతున్నారే! కాని, భగవంతుడు మా కన్నులను, ముక్కును. చెవిని, నోరును అన్నింటినీ బయటకే పెట్టాడు కాని, లోపలకు పెట్టలేదే..!! అంటూ కొందరు వాదించవచ్చును. నిజమే.... ఈ ఇంద్రియాలను బయటకు పెట్టాడు కనుక, బయటివి అనుభవించ వచ్చును. కాని కొన్ని నియమాలను విధించాడు. చెడ్డ విషయములను చూడ వద్దని కన్సులకు Shutters (తలుపులు) వేసాడు, ఇంక ఎక్కువగా మాట్లాడవద్దని నోటికి కూడా తలుపులు పెట్టాడు. నీవు కన్నులతో చూస్తున్నావు. ఐతే, చూసినవన్నీ లోపలకు చేర్చుకోవద్దు. చెవులతో వింటున్నావు. ఐతే, విన్నవన్ని హృదయానికి అందించ వద్దు. ఈ విశ్వస్వరూపాన్ని నీవు అర్థం చేసుకోవడం కోసమే నీకు ఈ ఇంద్రియములు అందించబడ్డాయి. కనుక ఈ ఇంద్రియాలను పవిత్రంగా ఉపయోగించుకో! "నాయనా...! నీ ప్రాణాన్ని కాపాడు కొనుటకై గాలిని పీల్చుకో. చక్కని సువాసనలను అనుభవించు" అని భగవంతుడు ముక్కు నందిస్తేఅతని ఆజ్ఞకు విరుద్ధంగా ముక్కులో నశ్యం వేసుకొంటున్నారు! "నీ దేహమును కాపాడుకొనే నిమిత్తమై భోజనం చేయి, మంచి మాటలనే మాట్లాడు" అనిభగవంతుడు నోటిని అందిస్తే-మద్యపానం చేయడానికి, చేపలను తినడానికి దీనిని ఉపయోగించుకొంటున్నారు. ఇది మానవత్వానికే విరుద్ధము.
ఇంద్రియములు చాలా శక్తివంతమైనవి. ఐతే, అలాంటి ఇంద్రియములను కూడా క్షణములో అణగదొక్కవచ్చు, కణములో వశం చేసుకోవచ్చు. అంతటి శక్తి మనలో ఉన్నప్పటికీ మనం ఉపయోగించుకోలేకపోతున్నాము. ఎందుచేత? వీటి సత్యస్వరూపాన్ని మనము గుర్తించనందు వల్ల....! చిన్న పిల్లవాడు అగ్ని కాలుస్తుందని తెలిస్తే దానిని పట్టుకోడు: తెలియనప్పుడే- దానిని పట్టుకొని కాల్చుకొని బాధపడుతున్నాడు. అత్యంత కఠినమైన ఇంద్రియ తత్వాన్ని అతి చిన్నదైన బుద్ధి చేతనే గుర్తించ వచ్చును. కక, మొట్టమొదట మనం బుద్ధిని చక్కదిద్దుకోవాలి. అప్పుడే మనకు జీవితమంటే ఏమిటో సులభముగా అర్థమౌతుంది.
(స.సా..జన్.94పు. 157/162)