ఒకనొక సమయంలో రాధమ్మ తన చెలికత్తెలను తీసుకొని మధుర నుండి బృందావనికి బయలుదేరింది, పడవలో తెల్లవారకమునుపే లేచారు. గుంపంతా పడవలో కూర్చున్నారు. వంతుల ప్రకారం ఒకరి తరువాత ఒకరు తెడ్లు వేసుకుంటూ నడుపుతున్నారు. ఎంత సేపో చేసారు. ఈ డ్రైవింగ్! చేతులంతా నొప్పి చేసాయి. తెల్లవారింది. కాని, పడవ మధుర రేవులోనే ఉంది! మధుర వాళ్ళంతా వచ్చి నీళ్ళు ముంచుకు పోతున్నారు. ఏమిటా దీనికి కారణం? అని చూసుకుంటే, ఆ పడవ ఒక కట్టుకు కట్టివేయబడి వుంది. ఆ కఱ్ఱకు కట్టిన త్రాడును వాళ్ళు విప్పలేదు. పాపం! అది విప్పకుండా ఎంత సేపు తెడ్డు వేసినా పడవ ముందుకు కదులుతుందా? ఉన్నచోటే ఉంటుంది. అదే విధంగా మనం ఎన్ని సాధనలు చేసినా ఎన్ని జప తపములు చేసినా, అభిమానంతో కట్టిన మనస్సును విప్పకపోతే చేరవలసిన స్థానమును చేరలేదు. ముందు అహాంకార, మమకారములనే త్రాడును విప్పాలి. త్యాగం చేయాలి. అన్ని విధాల బంధ విముక్తి గావించుకున్నప్పుడే పూర్ణ మనస్సు ఆవిర్భవిస్తుంది. పూర్ణ మనస్సు నందు ఎలాంటి దోషాలు కనిపించవు.
(శ్రీభ.ఉ.పు. 179)