రాముడు, కృష్ణుడు, సాయిబాబా వారు ధరించిన దుస్తులను బట్టి మీకు వేరువేరుగా కనిపిస్తారు. కానీ అన్నీ ఒకే తత్త్వం! నామాట విశ్వసించండి. ఈ పెద్ద భవనం, ఇంకా పెద్ద భవన సముదాయాలు ఇక్కడకు పిలువబడిన జనంతో చిన్నవయిపోయే రోజులు త్వరలోనే వస్తున్నాయి. భవిష్యత్తులో ఇక్కడ చేరిన జనసందోహానికి ఆకాశమే పైకప్పు అవుతుంది. ఆ జనసందోహం వల్ల నేను ఒకచోటు నుంచి మరొక చోటుకు వెళ్ళటానికి కారు, విమానం కూడా వదులుకొనవలసి వస్తుంది. ఆకాశంలోనే అడ్డంగా వెళుతూ కనిపించవలసి వస్తుంది. అవును అది జరుగుతుంది. నామాట నమ్మండి.
పుట్టపర్తి మధురానగరంగా మారటం మీరు చూస్తారు. ఈ అభివృద్ధిని ఎవ్వరూ ఆపలేరు. నేను మిమ్మల్ని వదలి పెట్టను. మీరెవ్వరూ నన్ను వదలుకోలేరు. ఒకవేళ మీకు నమ్మకం పోతే మీరు పశ్చాత్తాపం పొంది, మరల చేరటానికి ఇక్కడకే వస్తారు. నేను ఈ శరీరంలో ఇంకా 58 సంవత్సరాలు ఉంటాను. ఈ విషయం ఇది వరకే మీకు హామీ ఇచ్చాను. మీ జీవితాలు నాజీవితంతో ముడిపడి ఉన్నాయి. మీరు ఆ మహత్తరమైన అవకాశానికి అనుగుణంగా నడుచుకొండి.
(వ 61-62 పు.80/81)
"గోపాల బాల రారా, శ్రీసాయినాథరారా
శిరిడి యందు నీవుబాగా, సిద్ధాందితీవిసాయి
పుట్టపర్తి గ్రామమందూ, పుట్టొందితీవి మరల
పుణ్యముల కాకరమ్ము పుట్టపర్తి పురవరమ్ము"
(లో.పు.6)
"పుట్టపర్తి" అనే పేరు యెలా వచ్చిందో తెల్సా? ముందు దీనికి గొల్లపల్లె అని పేరు. చాలాకాలం క్రిందట గొల్లలు యెక్కువగా వుండినారు. గోవులను గాచి జీవితం నడుపువారు. ఆ మందలో ఒకపాడి ఆవు పుష్టిగా, అందంగా వున్నా, ఒక్క చుక్క పాలైనా యిచ్చేది కాదు. కారణం తెలియక గొల్లవాడు చింతించాడు. ఒకవేళ దూడ తాగేస్తు వుందేమోనని, దూడను దూరంగా కట్టాడు. లాభం లేదు. ఒకరోజు రాత్రి అక్కడే పడుకొన్నాడు. తెలతెలవారుచుండ ఆవు వెళ్ళటం చూచి, అనుసరించాడు. సరాసరి ఒక పుట్టవద్దకు వెళ్ళి ఆగింది. పుట్టలో నుండి పామువచ్చి ఆవు పొదుగులో నోరు పెట్టి, చక్కగా పాలు త్రాగుతూవుండటం చూచి, విస్మయచకితుడై, కోపం కొద్దీ, ఒక బండతీసి పాముపై విసిరాడు. పాము తల, తోక, వేరై నురగలు కక్కుతూ, బుసలు కొట్టుతూ "నీ గొల్ల వంశం నాశమగుగాక" అని శపించి ప్రాణములు విడిచి పెట్టింది. నాటినుండి క్రమీణ గొల్లవంశం క్షీణించిపోయింది. బోయలు విస్తరించారు. నాటి నుండి యెక్కడ చూచినా పాము పుట్టలు విపరీతంగా పెరిగిపోయింది. గొల్లపల్లి అన్న పేరుపోయి, పుట్టపల్లి అని పిలుస్తూ వచ్చారు. వల్మీకపురమని కూడా పేరుగాంచింది. క్రమీణ బోయవంశం కూడా నాశనమై, బ్రాహ్మణ వంశం వృద్ధి చెందింది. బ్రాహ్మణులు పూజాపునస్కారములు సరిగ్గా నెరవేర్చకపోవటం వల్ల, వారి వంశము నశించిపోయింది. తరువాత క్షత్రియ వంశజులైన రత్నాకర వంశం వెలసిల్లింది. పుట్టపల్లి అనే పేరు మెల్లగా పుట్టపర్తి అయ్యింది. పాత మందిరం ప్రక్కనే. వేణుగోపాలస్వామి గుడి వున్నది. ఈనాటికి అందులో దేవుడుగాని విగ్రహంగాని లేదు. పాము పై విసిరిన రాయివే యిక్కడ ప్రతిష్ఠించారు. దానికే నిత్యపూజలు సల్పుతున్నారు. ఆ రాయికి గంధం పూసితే, చక్కగా కాళింగమర్ధనం సల్పుతున్న క్రిష్ణుడు కన్పిస్తాడు."
(ఆ.శ.పు.126/127)
పుడమికి సరిమధ్య పుట్టపర్తి యనగ
ఆత్మ విద్య ఇందే అవతరించె
విశ్వ మానవ కోటి విజ్ఞాన మోందంగ
విశ్వవిద్యాలయము లిచట వెలసె
శాంతి సౌఖ్యములను సర్వ దేశములందు
వెదజల్లెడి విజ్ఞుడిచట వెలసె
నియతి తప్పని మహా నిష్ఠ గల భక్తులు
వేలులక్షలుకోట్లు వెలసిరట
సత్య థర్మ శాంతులు జగతిని
స్థాపించి భూమిలో చక్కగ సాయి ప్రభు
సత్య సాయి భువిని సంపూర్ణ
ప్రేమమూర్తి యగును పుట్టె మోదములర
(భ.ప్ర.పు.21)
ప్రవహించు నేపురి పరిధిగా పాయలై
చిత్రావతీనది విచిత్రగతులు
క్రాలు నేపట్టణ కల్యాణకరముగా
చుట్టును మేలైన చూతతరులు
కాపుండు నేపురి కడల నాల్గిటి యందు
పార్వతిశ్వరులెఫ్టు బాయకుండ
కొలువుండు నేపురి విలసితంబగు మధ్య
మహిమాన్వితుండైన మాధవుండు
మండలావని గణుతించు మెండు మహిమ
చిక్కవడియరు కట్టిన చెఱువుతోడ
బుక్కరాయల చిరకీర్తి భువనమెంచ
పోసగ చాటు నేపురము ల పుట్టపురము
పుట్టపర్తి అంటే ఏమిటి అర్థము? పర్తి అనగా, ప్రకాశము. పుట్టినటువంటి ప్రకాశమే పుట్టపర్తి. పూర్వం దీనికి పుట్ట వర్ధిని అని పేరు. ఎక్కడ చూసినా పుట్టలు పెరిగేవి. పాములు సంచరించేవి. దానివల్లనే ఆ పేరు వచ్చింది. రామాయణం రచించిన వాల్మీకి ఎక్కడివాడు? పుట్టలో నుండి పుట్టినటువంటివాడే. అతని పైన పుట్టలు పెరిగాయి. పాములు సంచరించాయి. కనుక, పుట్టలనుండి పుట్టినటువంటిదే రామాయణం. మీ హృదయమనే పుట్టలో దుర్గుణములు, దురాచారములు అనే పాములున్నాయి.అవన్ని బయటపడిపోవాలంటే మీరు భగవన్నామస్మరణ చేయాలి. నాదస్వరం వినిపిస్తే పుట్టలోని పాములన్ని బయటికి వచ్చినట్లుగా, మీరు నామస్మరణ చేస్తే మీ హృదయంలోని దుర్గుణాలన్నీ తొలగిపోతాయి.
హరేర్నామ హరేర్నామ హరేర్నామైన కేవలం
కలౌ నాస్త్యేవ నాస్త్యేవ నాస్త్యేవ గతి రన్యథా
నామస్మరణ చాలా పవిత్రమైనది. ఈనాడు నామస్మరణ తగ్గిపోవడం చేతనే దేశంలో బాధలు పెరిగిపోతున్నాయి. వీధివీధియందు నామస్మరణ చేయండి. మీ శరీరంలోని అణువణువునూ కణకణమునూ భగవన్నామంలో నింపుకోండి. నామస్మరణవలన కలిగే ఆనందము, ధైర్యసాహసాలు ఇంక దేనివల్లనూ లభించవు.
(సపా. మే. 2002 పు. 154)
(చూ|| చక్కచేసుకోండి. రైల్వే స్టేషన్, సంగీత విశ్వ విద్యాలయం, సంకల్పము, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ (పుట్టపర్తి))