మొదటిది అవిద్యా క్లేశము, రెండవది అభినవ క్లేశము, మూడవది అస్థిత కక్లేశము, నాల్గవది రాగక్లేశము, ఐదవది ద్వేష క్లేశము. ఈ పంచ క్లేశముల వల్లనే మానవుడు ఆత్మకు అత్యంత దూరమైపోతున్నాడు. ఆత్మదర్శనం చేసుకోలేకపోతున్నాడు. ఆత్మానందాన్ని అనుభవించలేకపోతున్నాడు. ఈ పంచ క్లేశముల పాంచభౌతిక శరీరమునకు అనేక ఇబ్బందులుకలిగిస్తున్నవి. దేహాన్ని అమితంగా ప్రేమించి, దాని నిమిత్తమై జీవితాన్ని ధారపోయడమే అవిద్యాక్లేశము. ఇది మానవునికి అనేక ఆశలను, రోగాలను కల్పించి, జీవితాన్ని దు:ఖమయం గావిస్తుంది. సర్వమునకు మనస్సే కారణమని తెలుసుకోలేక కంటికి కనిపించే దృశ్యమే ప్రధానమని భావించడం అభినవ క్లేశము. మనస్సును అరికట్టలేక, దేహభ్రాంతిని వీడలేక మానవుడు దుఃఖాన్ని అనుభవిస్తాడు. విషయ భోగములందు ఆసక్తియే అస్థిత క్లేశము. ధన, కనక, వస్తు, వాహనాదులు కావాలని అభిలషిచండమే రాగక్లేశము. అది మానవుణ్ణి అనేక విధములైన బాధలకు గురి చేస్తుంది. ఇంక,ద్వేషక్లేశమనగా ఏమిటి? మానవుడు కొన్ని కోరికలతో ఇతరులను ఆశ్రయించి, కోరికలు తీరితే సంతోషిస్తాడు: కోరికలు తీరకపోతే వారిని ద్వేషిస్తాడు. కేవలం సామాన్య మానవులు మాత్రమే కాదు. అనేకమంది భక్తులు కూడా భగవంతుణ్ణి ఎన్నో ఆశలతో ఆరాధన సల్పుతుంటారు. అవి సఫలమైతే ఆనందిస్తారు, విఫలమైతే భగవంతుణ్ణి కూడా ద్వేషిస్తారు. ఈ పంచ క్లేశములు మానవుణ్ణి బంధితుని గావిస్తున్నాయి.
తురీయావస్థలోనే మానవునికి ఆనందం లభ్యమౌతుంది. ఇట్టి పారమార్థికతత్త్యాన్ని గుర్తించాలనుకుంటే, మనస్సును నిర్మూలించుకోవాలి. లేక అదుపులో ఉంచుకోవాలి. క్రమక్రమేణ దేహాభిమానమును తగ్గించుకోవాలి.
(స.సా..ఏ.2000 పు.98)