కృష్ణుని లీలలు సామాన్యమైనవి కావు. అన్నింటిలోను అంతరార్థము, ఆనందము, ఆదర్శము నిండియుంటాయి. యశోదకు చుట్టుప్రక్కల ఇండ్ల వారంతా వచ్చి కృష్ణుని ఆగడాల గురించి ఫిర్యాదు చేస్తారు. అప్పుడామె అంటుంది కృష్ణా! మన ఇంట్లో నేను పెట్టిన వెన్న తినవుకాని పొరుగిండ్లలో జొరబడి వెన్న దొంగిలించి ఆరగిస్తున్నావు. మన ఇంటి వెన్నకంటే పొరుగింటి వెన్న నీకంత రుచిగా ఉందా?" దీనికి సమాధానంగా కృష్ణుడు "అమ్మా! నేను ఎక్కడికీ వెళ్ళలేదు, వెన్న తినలేదు. కావాలంటే నా నోరు వాసన చూడు" అంటూ తన చిన్నారి ముద్దు ముద్దు మాటలతో తల్లిని ఆనందపరుస్తాడు. కాని ఒకనాడు యశోద ఇరుగు పొరుగు వారి ఫిర్యాదులు వినలేక కృషుణ్ణి పట్టి ఒక రోటికి కట్టివేయాలని నిశ్చయించుకుంది. కానీ కృష్ణుణ్ణి పట్టుకోవడం సాధ్యమా! చివరకు కృష్ణుడు తనంతట తానేయశోదకు పట్టుబడాలని సంకల్పించుకొని, ముంతల నుండి పాలు, పెరుగులను గ్రుమ్మరించి, వాటిలో తన పాదాలను అద్దుకొని ఒకవైపుగా పరుగెత్తాడు. ఆ పాదముద్రలను అనుసరించి యశోద కృష్ణుణ్ణి పట్టుకొన్నది. ఇక్కడ అంతరార్థాన్ని గమనించాలి. పాదముద్రలను అనుసరించడం చేతనే యశోద కృష్ణుణ్ని పట్టుకోగల్గింది. కృష్ణుని పాదముద్రలే ఆమెకు మార్గాన్ని చూపాయి. అలాగే మీరు కూడా దైవాన్ని అనుసరిస్తే దైవం చూపే బాటలో ప్రయాణిస్తే దైవాన్ని చేరుకోగలరు. అందుకే నేను "మై లైఫ్ ఈజ్ మై మెస్సేజ్”అంటాను "ఫాలో ది మాస్టర్" అని కూడా చెపుతుంటాను.ప్రేమమూర్తిని చేరుకోవాలంటే ప్రేమమార్గంలోనే ప్రయాణించాలి.
ఒకనాడు యశోద కృష్ణుణ్ణి పట్టుకోవాలనుకుంది. ఏం చేసింది? ఒక చేతిలో వెన్న ముద్దను చూపిస్తూ మరొక చేతిలో బెత్తమును పట్టుకొని వెనుకగా దాచుకొంది. వెన్న చూసి కృష్ణుడు దగ్గరకు వస్తే పట్టుకొని కఱ్ఱతో కొట్టి శిక్షించాలనుకొంది. అలాగే ఈనాడు నేను కూడా విద్యాసంస్థలనే వెన్న చూపి యువతను ఆకర్షించి, ఆ తరువాత శిక్షణ అనే బెత్తంతో వారిని సరి చేస్తున్నాను. ఒక రోజున ఒక గోపిక బావి దగ్గర రెండు కడవల నిండా నీరు నింపుకొంది. వాటిని తన నెత్తిన ఒక దానిపై ఒకటి పెట్టుకోవడానికి ఆమెకు సహాయం అవసరమైంది. ఇంతలో కృష్ణుడు అటువైపుగా నడుచుకొంటూ వస్తున్నాడు.
"కృష్ణా! ఈ కడవలను నెత్తిన పెట్టుకోవడానికి సహాయం చెయ్యి" అని దీనంగా అడిగింది. కానీ కృష్ణుడు పట్టించుకోకుండా వినిపించునట్లు వెళ్ళిపోయాడు. కొంత సేపయ్యాక ఆమె ఏదోవిధంగా రెండు కడవలను నెత్తిన పెట్టుకొని ఇంటి దాకా వచ్చింది. ఈ సమయానికి అక్కడే ఉన్న కృష్ణుడు వెంటనే ఆమెను సమీపించి ఆమె నెత్తిమీద కడవలను క్రిందికి దింపడంలో సహాయపడ్డాడు.
అప్పుడా గోపికా కృష్ణా! బావి దగ్గర నీటిని నా నెత్తిమీద పెట్టమని అడిగినప్పుడు మాట్లాడకుండా వెళ్ళిపోయావు. మరి ఇప్పుడేమో అడక్కుండానే సహాయం చేస్తున్నావు. ఏమి కారణం?" అని అడిగింది. దానికి కృష్ణుడే "అమ్మా! నేను బరువులను దింపేవాడినే కాని పైన వేసేవాడిని కాను అని చక్కని సమాధానం చెప్పాడు. అనగా భగవంతుడు మీ బరువు, బాధ్యతల్ని తగ్గించేవాడేకాని పెంచేవాడు కాడనే ఆంతరార్గాన్ని మీరు గుర్తించాలి.
భాగవతంలోని కథలు నవవిధ భక్తి మార్గాలను చక్కగా బోధిస్తాయి. తరించే మార్గాన్ని సూచిస్తాయి. అందువల్లనే వ్యాసుడు అష్టాదశ పురాణాలను రచించినా మనశ్శాంతి లేక బాధ పడుతుంటే నారదుడు భాగవతం రచింపుమని అతనికి సలహా ఇచ్చాడు. కనుక శాంతి సౌఖ్యాలకు సంతోష సాభాగ్యాలకు భాగవతాన్ని మనసారా ఆలకించాలి, ఆచరించాలి. భాగవతం అంటే భగవత్కథ అంటారు. కాని భాగవతం అంటే బాగవుతాం అనే చెప్పాలి. భాగవతము అనే ఐదక్షరాలలో భ - అనగా భక్తి, గ - అనగా జ్ఞానము వ - అనగా వైరాగ్యము, త - అనగా తత్వము, ము - అనగా ముక్తి. వీటిని గమనించి ఆచరించి తరించాలి.
(స.పా.ఆ 98 పు. 273/274)
వ్యాస మహర్షి పరీక్షిత్తునితో "నాయనా! వాసుదేవుని లీలలు వక్కటీ రెండు కలవని తలంచితివా, లెఖ్ఖ కతీతమైన అతనిలీలలు యేమని తెలుపగలము? ఫలానా సమయమున ఫలానావారితో జరిగిన లీలలు తెలుపమని కోరిన, దానికి సంబంధించిన విషయమును చక్కగా ముచ్చటింతును" అని మహాఋషులు తెలుపగనే పరీక్షిత్ శ్రద్ధాళుడై చేతులు జోడించు కొని "స్వామీ! మొదలు మా తాతలకు కృష్ణ పరమాత్మకు యెట్లు స్నేహము కుదిరెనో ఆ విషయమును గురించి తెలుప "మని కోరెను.
అంత వ్యాసులవారు ఫక్కున నవ్వి, “నాయనా! నీశ్రద్ధ నాకెంతయో ఆశ్చర్యమును కలిగించుచున్నది. ఇట్టి శ్రద్ధగలవారికే జ్ఞానము సిద్ధించును. కాన, శ్రద్ధాళుని చూచిన, వారికి ఆనందమును, తృప్తిని అందించుటే నాకు ఆనందము; కాన తెలిపెదను, వినుము " అని ఆసనముపై స్థిరముగా సుఖాసనమువైచి కూర్చొనెను. పరీక్షితుడు కూడనూ తన హృదయమును వికసింపజేసుకొని చెవులను చాటలువలె నిక్క పరచుకొని వినుటకు సిద్దమాయెను. "నాయనా! దృపద మహారాజు తన యేకైక పుత్రికయైన ద్రౌపదికి పెండ్లి చేయతలంచి యెన్నియో సంబంధములు విచారించెను. అయితే తన కూమార్తెకు తగిన వరుడు చిక్కకుండుటచే తాను స్వయంవరమును వక దానిని యేర్పరచెను. అందులో అనేకమంది బలవంతులగు రాజలు, సౌందర్యవంతులైన విద్యావంతులు. పాల్గొని యెవరికివారు ఆ త్రైలోక్య సుందరని పెండ్లాడవలెనని వారివారి ధన, దేహబలములను ప్రదర్శించుకొనుచూ సభలో చేరుచుండిరి. ఆ సభలో పైభాగమున వక యంత్రము గట్టబడియుండెను. ఈ యంత్రమున కట్టబడిన మత్స్యమును లక్ష్యము తప్పక యెవరు భేదింతురో వారలకు ద్రౌపదినిచ్చి వివాహమొనరింతునని దృపద మహారాజు సంకల్పము. ఇట్టి మహారాజుగారి నిబంధన ననుసరించి భేదించి ద్రౌపదిని వివాహమాడవలెనని రాజ్యమున యెటుచూచిననూ పరరాజులు క్రిక్కిరిసి తిరుగాడుచుండిరి.
ఈ వింత విషయము బ్రాహ్మణుల వేషమున నున్న మిా తాతలకు తెలిసియూ, వారికి తగిన సమయము కానందున ప్రయత్నించలేకపోయిరి. కానీ, ఇట్టి వీర పోరాటము జరుగుచుండ చూచుచూ వూరకుండుట కత్రియ లక్షణము కానందున, అర్జునుడు అనగా మిాతాతగారు. అన్నగారితో సంప్రతించి స్వయం వరమునకు వెళ్ళుటకు సంసిద్ధులై బ్రాహ్మణవేషములతోనే సభా మధ్యమున ఐదుగురు సింహములవలె వారి తేజస్సు కాంతిగ్రమ్ముచుండ, సభలో చేరిన వారి దృష్టి అంతయూ వీరలపై పడి కొందరు వారి తేజస్సును చూచి, మహా వీరులనియూ, వారి వేషములను చూచి యెవరో వంట బ్రాహ్మణులవలె వున్నారనియూ ఈ రీతిగా పరిపరి విధముల సంభాషణలు, గుసగుసలు మొదలు పెట్టిరి. ఆ సమావేశమునకు కృష్ణబలరాములు కూడనూ వచ్చి యుండిరి. అయితే సభలో ఉన్నంతకాలము కృష్ణుని దృష్టి అర్జునిపై పడుట బలరాముడు గ్రహించి, వారిలో వారు, బలరామ కృష్ణులు యేదో చెవులలో చెప్పుకొను చుండెడివారు.
కడకు స్వయంవరవ్రతము ప్రారంభమాయెను. ఒక్కొక్కరూ ఛాయదగ్గరవెళ్ళి. వారి శక్తి సామర్థ్యములను ప్రవేశపెట్టి విఫలులై తెల్లమొఖములతో అవమానముతో నిరాశతో వెనుకకు తిరిగి వచ్చి వారి వారి స్థానమున తలలు వంచి, విచారగ్రస్తులై కూర్చొను చుండెడివారు. అయితే కృష్ణుడు స్వయంవరమునకు వచ్చెను. కాని యంత్రమును కొట్టుటకు పూనుకోలేదు. అతనే సంకల్పించియుండిన అవలీలగా భేదించి యుండెడివాడు, కానీ అతని సంకల్పము యేమో యెవరు చెప్పగలరు? అంతలోమీ తాతగారైన అర్జునుడు లేచి యంత్రమునకు సమీపమున వచ్చుచుండ, సభ అంతయూ యేదో వక మెరుపు మెరసినట్లు తేజస్సు ప్రకాశించెను. ద్రౌపది తలయెత్తి చూచెను. ఆమె మనసు ఆ ప్రకాశమున లీనమాయెను. క్షణకాలములో ద్రౌపది పుష్పమాలాలంకృతురాలై మీతాత మెడలో మాలను వేసి చేయిపట్టెను. అందరి రాజుల మధ్య బ్రాహ్మణ వేషమున నున్న అర్జునుడు ద్రౌపది చేయిపట్టి సభామంటపమున వచ్చిన తక్షణమే పరాజయులైన రాజులు వోర్వలేక, ఇది న్యాయమైన స్వయంవరము కాదని యునూ, ఈ బక్క బ్రాహ్మణుడు ఈ స్వయంవరమున ప్రవేశింప వీలులేదనియునూ సాకులు కల్పించకొని రాజలందరూ యేకమై మీతాతయైన అర్జునిపై పడిరి. ఇంతలో భీముడు వక పెద్ద వృక్షమును లాగి. చేరిన రాజులందరినీ బాద ప్రారంభించెను.
కానీ మీతాత ద్రౌపదిని తీసుకొని తమ వసతి గృహమైన కుమ్మరివారింటికి చేరగనే అన్నయైన ధర్మజుడు జరిగిన విజయమునకు సంతసించుచూ, ఆనందముగ వకరికొకరు ముచ్చటించు చుండగ, పీతాంబరధారులై బలరామకృష్ణులు ఆ కుమ్మరి గృహమును ప్రవేశించి వృద్ధురాలైన మితాతల తల్లి కుంతికి నమస్కరించి, "అత్తా మేము మీ అల్లుళ్ళము. కృష్ణబలరాములము: నందయశోదల పుత్రులము." అని వారికి వారే తెలుపుకొనుచూ తరువాత ధర్మజునకు నమస్కరించి చిన్నబాలునివలె అమాయకునివలె అర్జునిని చెంత వచ్చి, "బావా! నేను నిన్నురుగుదుము. కానీ, నన్ను నీవెరుగవు. ఇదే నిన్ను చూచుట మొదలు. నేను వసుదేవుని కుమారుడను. నా పేరు శ్రీకృష్ణుడు. మీకంటే నేను చిన్నవాడనే. అయినా మీరు ఈనాడు దిగ్విజయమును గాంచుటచూచి వీరు నిజముగా పాండవులే అయివుందురనియూ మిారు లక్కగృహమునుండి తప్పించుకొని క్షేమముగా యున్నారనియూ తలంచితిని. మిమ్ములను ఆ సభలో చూచినది మొదలు నా కెందులకో మీరు అర్జునుడే అయివుందురన్న నిశ్చయము నన్ను ఆనందపరచి అన్నతో అనగా, బలరాములతో తెలుపు చుంటిని.
"కడకు మిమ్ములను కలిసికొన గలిగితిని చాలా ఆనందము. అమ్మాయి చక్కని గుణవంతురాలేకాక మహా తెలివితేటలుగలది", అని పలకరించి, మిా తాతయైన అర్జునుని మాత్రమే వక ప్రక్కకు పిలిచి, మెల్లగా చెవిలో ఈ రీతిగా తెలిపెను. యేమన. "బావా! మిారిప్పుడే ప్రకటమగుట మంచిది కాదు. ఇంకనూ కొంతకాలము అందందు నివసింపుడు" అని ప్రేమతో తెలిపి శెలవు తీసుకొని బలరామకృష్ణులు బయలుదేరిరి.
"ఆనాటితో కృష్ణార్జునుల ప్రేమ పెరిగి అది వృక్షమై కాయలై ఫలములై మధురమైన రసమును ఆరగించి ఆనందించి, అందులో లీనమయిరి; వింటివా? మొదలు కృష్ణుడు మిా తాతను చూచుట ద్రౌపది స్వయంవర మంటపమందే, చూచితివా? వారిచేరిక కల్యాణ మంటపమున కనకనే, అర్జునుడు జీవిత మంతయూ నిత్య భగవత్ సన్నిధియను కల్యాణమున పారమార్థ ప్రాప్తిని అనుభవించెను, అంతియేకాక అతని నిమిత్త మాత్రునిగ నిలబెట్టి లోకమునకే జ్ఞానమును బోధించెను. వింటివా? కొంటి కృష్ణుడు మిాతాతలతో యెంత ఆప్యాయముగ నుండెడివాడో"! అని, బయలుదేరుటకు నడుచుకొను చుండినటుల కనుపించిన వ్యాసులవారిని చూడగనే పరీక్షిత్ తన కన్నులవెంట కారుచుండిన నీరును అంగవస్త్రముతో తుడుచుకొనుచు,
"స్వామీ! మీరు కృష్ణపరమాత్ముని చరిత్రను చెప్పి భావజగత్తులో అతనిని సాక్షాత్కరింప చేయుచున్నారు. మిారు వూరకుండుటచే నాకు చాలా బాధకలుగుచున్నది. ఆలీలామానుష విగ్రహుడైన శ్రీ కృష్ణుడు మాతాతలతో ఇంకా యేయే సమయములందు యేరీతిగా కలసిమెలసి కాపాడుచుండెనో తెలిపి, నన్ను కృతార్థుని చేయుము. నా నిద్ర నేత్రములను విడచి భగవంతుని వెతుక బోయి నట్లున్నది. ఈ రాత్రి పూర్తిగా, తమరు అతని స్మృతి కలుగ చేయుడు; నా పై కొంత అనుగ్రహము చూపుము." అని ప్రార్థించు పరీక్షితుని శ్రద్ధాభక్తిని చూచి వ్యాసులవారు మనసు మార్చుకొని, "నాయనా! కృష్ణుని అమానుష లీలలు వకటి రెండైన చెప్పవచ్చును. వక్కొక్క రోమ రోమమునకు కోటి కోటి జిహ్వలుండి కల్పాంతము వరకూ వర్ణించిననూ అతని లీలలు తరుగవు, సర్వదేవతలు అతని చెంత చేతులు జోడించి నిలుచుండెడివారు. అతడు వకతూరి తమ భక్తులను ఆకాశముపై నెక్కించెడివాడు. అంతలోనే క్రిందికి పెట్టెడివాడు, లోకమునే వక బొమ్మలాట ఆడించెడివాడు. అతను యెట్టి సమయమందైననూ చిరునవ్వులు చిందులు గొలుపు వాడేకాని విచారములుకానీ, సంతాపములు కాని, అతను యెరుగడు. వకప్పుడు సామాన్య మానవునివలె అమాయకునివలె బంధువునివలె మిత్రునివలె రాజువలె గొల్లబాలునివలె వకటేమి అన్నిటియందూ అన్ని విధముల మెలగగల శక్తి యుక్తులుగల పామరునివలె వ్యవహరించెడివాడు.
(భా.వా, పు. 97/101)