ప్రేమొక్కటే భగవంతుని అనుగ్రహమును పొందుటకు ఉత్తమ మార్గము. నీ స్వంత సోదరీ సోదరులను నీవెట్లు దగ్గరకు చేర్చుకొనెదవో ప్రతివారిని అట్లే చేరదీసి వారియెడల శ్రద్ధా బాధ్యతలను వహింపుము. నిజముగా కార్మికుని జీవితము చాలా విలువైనది, ప్రధానమైనది. కర్మభక్తి స్థానములు భగవంతుని చేర్చునట్టి మార్గమున మూడు ఘట్టములు. చిత్తశుద్ధితో, పరులయెడల గౌరవముతో, భక్తితో చేసిన కర్మ ప్రధానమైనది. శరీరము, మనస్సు ఎంత సన్నిహితముగా నుండునో యజమాని కార్మికుడు అంత సన్నిహితముగా నుండవలెను. యజమాని హృదయము, కార్మికుడు శరీరము వంటివాడు. శరీరము లేక హృదయము, హృదయము లేక శరీరము ఉండజాలవు. రెండూ ఒకదాని కొకటి అవసరము. యజమాని సేవకుల సంబంధము తండ్రి బిడ్డల సంబంధము వంటిదిగా నుండవలెను. అటువంటి ఆదరానురాగము సహజముగా వుండి, భ్రాతృత్వ వాతావరణముతో కార్మికులు పనిచేసిన పరస్పర సహాయ సహకారములతో పరిశ్రమ వృద్ధిగాంచును. యజమాని సేవకులూ అన్యోన్య భావముతో శాంతి సంతోషములు పొందగలరు.
“ఈ సాంఘిక సంక్షేమ భవనాన్ని ఇప్పుడే ప్రారంభించితిని. మీరందరు నెలకొక పర్యాయము, అంతకంటే తరచుగా, పక్షమునకో, వారమునకో, ఒకసారి మీరందరు యిక్కడ సత్సంగము కొరకు కాని, భజన కొరకు కాని, ఆధ్యాత్మిక కార్యకలాపముల కొరకు కాని, సమావేశము కావలెనని - నాఆభిమతము. కార్మికుల బిడ్డల కిక్కడే ఒక పాఠశాలను
ఏర్పాటు చేసి క్రమశిక్షణ, భగవద్భక్తి, సచ్చీలసంపద వారిలో అభివృద్ధి అగునట్లు చూడ గోరుచున్నాను.
క్రమశిక్షణ మానవుని ప్రతి ప్రయత్నమందును అత్యంత అవసరమైన పరికరము. క్రమశిక్షణతో మెలగినప్పుడే మానవుడే మైన సాధించి జీవితము సార్థకము చేసుకొనగలుగును."
(స. శి. సు. తృ, పు.156)