కారణములు రెండు విధముల నుండును. అవియే ఉపాదాన కారణము, నిమిత్తకారణము.
ఉపాదానకారణము - ఇది వస్తువునకు పూర్వమే పూర్ణమైన ఆధారముగ నుండును. ఒక వెండి గిన్నె ఉన్నదనుకొనుడు. దీనిలో నున్న వెండి, గిన్నెకు పూర్వమే ఉన్నది. అదే ఉపాదాన కారణము. అనగా, గిన్నె అనగా, గిన్నె చేయుటకు ఆధారమైన వెండియే లేకున్న గిన్నె చేయలేరు. వెండిని వదలి, ఆగిన్నె ఉండలేదు. వెండిని గిన్నెను. వేరు చేయుటకు వీలుకాదు. అంటే ఒక రూపమునకు పూర్వమే, ఆ రూపమునందున్న పదార్థము, ఆధారముగా నున్నది. రూపము కల్పితము, వెండి పూర్వ సిద్ధము. అయితే గిన్నెకు నిమిత్త మాత్రము. ఒక కంపాలి. గిన్నె తయారైన తరువాత నిమిత్త కారణమైన కంసాలిని వదలి, ఆ గిన్నె వేరై ఉండవచ్చు. కాని, వెండిని వదలి వేరుగా నుండుటకు వీలుకాదుగదా!
అటులనే ఈ ప్రపంచమను పెద్ద పదార్థమును ఒక రూపముగ తయారు చేయుటకు, దీనికి ఆధారము భగవంతుడే. అతడే ఉపాదాన కారణము. దీనికి నిమిత్త కారణము కూడా భగవంతుడే. వెండి గిన్నెలో వెండి వ్యాపించియున్నట్లుగా, ప్రపంచమను ఈ భాండములో ఉపాదానకారణమైన భగవంతుడు వ్యాపించియున్నాడు. దీనికి నిమిత్త కారకుడు కూడా భగవంతుడే. సమస్త పదార్థముల యందు పదార్ధము అంతర్లీనమై యుండును. పదార్థములేని పదార్థము ప్రపంచమున ఉండుటకు వీలులేదు. ప్రతి పదార్థమునకు ఒక పరార్థము ఉండియే తిరవలెను.
(సూ.వా. పు. 38/39)
వివిధ శాస్త్ర చయము వేద వేదాంగముల్
జీవి మనసు తెరను చీల్చ లేవు |
తెరకు యీవల జీవి దేవుడవ్వల నుండు
కార్యమివల ఆవల కారణంబు :
(సా. పు. 589)
నిజముగా దుఃఖమునకు కారణము జన్మ. జన్మకు కారణము కర్మ, కర్మకు కారణము రాగద్వేషములు. రాగద్వేషములకు కారణము పరిస్థితుల ప్రభావము. పరిస్థితుల ప్రభావమునకు కారణము బుద్ధి. బుద్ధికి కారణము ద్వైతము. ద్వైతమునకు కారణము అజ్ఞానము. కావున అజ్ఞానమే దుఃఖమునకు కారణము. దృష్టి ఎప్పుడైతే జ్ఞానమయమవుతుందో, అప్పుడు సృష్టి అంతా బ్రహ్మమయంగా గోచరిస్తుంది.
(శ్రీ.భ. ఉ. పు.12)
(చూ|| జన్మ, జ్ఞాని, దివ్య ప్రకటనలు, రోగము, సంపర్కము)