పాండవుల రణ్యములో నుండగా, కృష్ణుడొకప్పుడు వారిని చూచుటకు వెళ్ళెను. అప్పుడు ధర్మరా జు, తమకు కలిగిన కష్టములను, వాటి మూలమున తమ మనసుకు గలిగిన
యాందోళనను చెప్పుకొని “కృష్ణా నీవు మాతో కొన్నిదినములుండుము అట్లయిననే నా చిత్తమున కింత శాంతి యేర్పడునని" ప్రార్థించెను. కృష్ణుడు చిరునవ్వు నవ్వి "బావా! మీతో నున్నట్లే యనుకొనుము. కష్టసుఖములు మానవులకుగాక, మానులకు వచ్చునా? అధైర్య పడకుము, దీనిని చూచుకొనుము. అదియే నీకు మనశ్శాంతి నియ్యగలదు" అని చెప్పి, చీటి వ్రాసి, సీలుకవరులో పెట్టి యిచ్చిపోయెను. ధర్మజుడా కవరును కన్నుల కద్దుకొని, దేవతార్చన పేటికలో నుంచుకొనెను. చీటిలో నున్నమాట ఒక్కటే. "ఎల్లకాలమును ఉండబోదు" అన్నమాట అందున్నది. వచ్చిన కష్టముగాని, సుఖముగాని మరలపోవునవే గాని, స్థిరముగా నుండునవి కాదని భావము. ఆ రెంటిచేతను మనస్సును చెదరనియ్య గూడదని కృష్ణుడు చేసిన బోధ.
(త్య. శ. మ. పు. 262)
కష్టం లేనిదే సుఖం రాదు. “న సుఖాల్లభ్యతే సుఖమ్", సుఖం నుండి సుఖం రాదు. కష్టం ఫలిస్తేనే సుఖం అంటారు. కష్టం లేకపోతే సుఖం విలువ తెలియదు. ఉదాహరణకి నువ్వు ఎయిర్ కండీషన్ గదిలో కూర్చున్నావు. ఆ చల్లదనం విలువ నీకు ఎప్పుడు తెలుస్తుంది? కాస్త బయట ఎండలో చుట్టి వస్తేనే కదా! మరణ భయం లేకపోతే తల్ల్తెనా బిడ్డను ప్రేమించదు. నారింజపండు పైనున్న చేదైన చర్మం లోపలున్న తీయని రసాన్ని రక్షిస్తోంది. అనగా ఇందులో మంచి, చెడ్డ రెండూ కలిసే ఉన్నాయి. కదా! అసలు ఒకప్పుడు సుఖాన్నిచ్చింది మరొకప్పుడు బాధనిస్తుంది. ఏదీ ఎప్పుడు కేవలం సుఖాన్నే ఇవ్వదు, లేక కేవలం దుఃఖాన్నే కలిగించదు. ఉదాహరణకు, వులన్ కోటు శీతాకాలంలో సుఖం, ఎండాకాలంలో దుఃఖం. హీటరు శీతాకాలంలో సుఖం. ఎండాకాలంలో దుఃఖం. సుఖదుఃఖాలు దేశ కాల మాన ప్రభావాలపై ఆధారపడి యుంటాయి. నిజానికి సుఖంగాని, దు:ఖంగాని శాశ్వతంగా ఉండేవి కావు. Pleasure is an interval between two pains. కష్టకాలంలో కష్టాన్నే తల్చుకుంటూ ఉంటే అది ఇంకా అధికమవుతుంది. కష్టకాలంలో సుఖంగా ఉన్న రోజాల్ని తల్చుకోవాలి. భగవంతుడు పెట్టే పరీక్షలుగా కష్టాల్ని ఎదుర్కోవాలి. భక్తుడు అలాంటి టెస్టులకు స్వాగతం పలకాలి. పరీక్షలు పెట్టనిదే విద్యార్థి పైక్లాసుకు ఎలా పోగలడు? రోగికి టెస్టులు చేయకుండా డాక్టరు రోగాన్ని నిర్ధారించగలడా? బంగారం అందమైన నగగా తయారు కావాలంటే దానిని ఎంత కాల్చాలి?! దానికి ఎన్ని సుత్తి దెబ్బలు పడాలి? చెరుకును పిప్పిగొట్టి రసమును తీసి బాగా కాచి సంస్కరించినప్పుడే పంచదార తయారౌతుంది. నీ కాళ్ళ క్రింద మన్నును త్రొక్కుతుంటావు. దానిపై నడుస్తుంటావు. అదే బంకమన్నును బాగా సంస్కరించి కుండగా తయారు చేస్తే దానిని నెత్తిన పెట్టుకుంటావు. మన్నుగా ఉన్నప్పుడు అది కాళ్ల క్రింద ఉంది, కుండగా మారినప్పుడు శిరస్సు పైకి ఎక్కే స్థితిని పొందింది. ఎందువల్ల? బాగా సంస్కరింపబడడంవల్ల. కనుక కష్టాలకు వెఱువకూడదు. కష్టాలు వద్దనకూడదు. కుంతీదేవి కూడా కష్టాలనే కోరుకుంది. "కృష్ణా! నీ సన్నిధానం, నీ చింతన కష్టకాలంలోనే ఎక్కువగా లభిస్తాయి. కనుక నాకు కష్టాలనే ప్రసాదించు" అన్ని ప్రార్థించింది.
(స... ఫి 98 పు. 55/56)
(చూ ప్రేమనేర్పుకోసం)