గోవునుంచి తీసిన పాలు, ఇక మీగడ, వెన్న సాధకునికి మంచివే. ఇక్కడ గోవుకు ఎటువంటి హాని కలుగక పోగా ఇంకా మంచే జరుగుతున్నది. ద్వాపర యుగములో, కలియుగమునకు 5680 సంవత్సరముల క్రితమే పాలు వాడుకలో ఉన్నాయి. కలియుగము పూర్తి కాలపరిమాణము 11000 సంవత్సరములు.
(ప. పు. 32)
జ్యోతిశ్శాస్త్రమును పురస్కరించుకొని కృష్ణుడు పుట్టిన దినమును సరిగా నిర్ణయించవచ్చును. జూలై 20వ తేదీ క్రీస్తుకు పూర్వము 3228వ సంవత్సరము శ్రీముఖనామ సంవత్సరము శ్రావణ బహుళ అష్టమి రోహిణి నక్షత్రమందు అర్ధరాత్రి 3 గంటల సమయమందు కృష్ణుని జననం. ఇది సరియైన దినము. ఈనాటికి కృష్ణుడు నిర్యాణముచెంది. 5078 సంవత్సరములు అయింది. దీనిని మీరు సరిగా కూడుకొన్నప్పుడు 3102+1976 = 5078 వస్తుంది. ఈ నాటికి కలియుగము ప్రారంభమై 5078 సంవత్సరములు అయినది. కృష్ణుడు దేహమును చాలించినదినమే కలియుగ ప్రారంభము. దీనినే మనము యుగాది (కలియుగమునకు ఆదిదినము కనుక) పర్వదినముగా భావించి పండుగ చేసికొనుచున్నాము. కలియుగము ప్రమాదీచనామ సంవత్సరములో ప్రారంభమగుటచే ప్రమాదమైనదిగానే గోచరిస్తున్నది. కలియుగ మనుటకంటే కలహ యుగమముట సహజముగా నుండును. ఎక్కడ చూచినా కలహమే. గృహమునందు కలహమే. సమాజమునందు కలహమే. దేశమందు కలహమే. వ్యక్తికి వ్యక్తికి కలహమే. కనుక దీనిని కలహయుగమనుటలో సార్థకత ఉంది.
(నీ. వే. వె. పు. 131/132)
ఈనాడు కలియుగం కలహయుగంగాను, కలుషిత యుగంగాను మారిపోతున్నది. ప్రేమ శూన్యమై పోతున్నది. బంధు మిత్రుల ప్రేమ చూపించినట్లుగా కనిపిస్తున్నారు గాని, నిజమైన ప్రేమ ఎవ్వరియందూ లేదు. మీకు లౌకికమైన మిత్రులు అనేకమంది ఉండవచ్చును. వారి స్నేహం హలో, హౌ ఆర్ యు, గుడ్ బై.... ఇంతటితోనే ఆంత్యమైపోతుంది. కాని, భగవంతుడు ఆలాంటి మిత్రుడు కాదు. తాను ఎల్లప్పుడు మీ ఇంటనే, వెంటనే, జంటనే,కంటనే వుండి మిమ్మల్సి కాపాడుతుంటాడు. భగవంతుడే సత్యనిత్యమైన మిత్రుడు కాని, అట్టి మిత్రుణ్ణి విస్మరించి, లౌకికమైన మిత్రులను విశ్వసించి మీరు భ్రమలో మునిగిపోతున్నారు.
(స.సా.న.99పు, 320)
(చూ॥ కురుక్షేత్ర యుద్ధం)