కర్మ దాట వశమా!
నరుడా, కర్మ దాట వశమా!
ఘన పాఠంబులు చదివినగాని
కులదేవతలను కొలచినగాని
కారడవులకే పోయినగాని
కఠిన తపస్సులే చేసినగాని
కర్మ దాట వశమా!
చిన్న చెలమలో ముంచినగాని
ఎన్ని సముద్రముల్ నింపినగాని
కడవెంతోరా! నిరంతేరా!
కావాలన్నను ఎక్కువ రాదురా!
కర్మదాట వశమా!
అయితే దైవానుగ్రహాన్ని పొందితే ఎలాంటి కర్మలూ అడ్డు తగలవు.
సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడు అనేకమంది. అనేక రకములైన కర్మలు చేస్తుంటారు. కానీ, ఆ కర్మల ఫలితం సూర్యునికి అంటదు. సూర్యుడి నుండి ఆవిర్భవించిన మేఘాలు సూర్యుడినే కప్పివేస్తాయి. అంతమాత్రాన సూర్యునికి వచ్చిన నష్టమేమీ లేదు. అదే విధంగా, దైవం నుండి ఆవిర్భవించిన మానవుడు దైవాన్నేవిమర్శిస్తుంటాడు. అంతమాత్రంచేత దైవానికి ఏమీ నష్టం లేదు. సూర్యప్రకాశంచేత మేఘములు పుట్టినట్లుగా, ఆత్మ ప్రకాశంచేత మనస్సు బుద్ధి, చిత్తము పుడుతున్నాయి. కష్టనష్టములకు మనస్సే కారణం. పునర్జన్మకు కూడా మనస్సే మూలం. కనుక, మనస్సును దైవంవైపు మరల్చాలి అప్పుడు ఎట్టి కర్మలూ మిమ్మల్ని బాధించవు. పర్వతములవలె వచ్చిన బాధలు కూడా మంచువలె మాయమౌతాయి. దైవకృపచేత ఎట్టి బాధలనైనా పరిహారం గావించుకోవచ్చు. ఇక్కడ "కర్మ దాట వశమా "అనేది. వర్తించదు. అయితే, కర్మకు తగిన ఫలితములు వస్తుంటాయి. వచ్చినప్పటికీ దైవానుగ్రహం వల్ల వాటి నుండి తప్పించుకోవచ్చును.
మృకండు మహర్షి కుమారుడైన మార్కండేయునికి ఈశ్వరుడు 16 సంవత్సరాల ఆయుస్సును ప్రసాదించాడు. ఈ రహస్యం మార్కండేయునికి తెలియదు. ఒకనాటి రాత్రి మృకండుడు, అతని భార్య ఇంట్లో కూర్చుని విలపిస్తున్నారు. మార్కండేయుడు "అమ్మా నాన్నా! మీ విచారమునకు కారణమేమిటి?" అని ప్రశ్నించాడు. "నాయనా! ఈశ్వరుడు నీకు 16 సంవత్సరముల ఆయుస్సును మాత్రమే అనుగ్రహించాడు. ఈనాటితో నీకు 16 సంవత్సరములు నిండుతున్నాయి. ఇంక నీకు, మాకు ఎట్టి సంబంధమూ ఉండదు." అని చెప్పారు. "ఈ మాట నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఈశ్వరానుగ్రహంచేత ఎలాగైనా నా ఆయుస్సును పొడిగించుకుంటాను" అని పలికి అతడు తక్షణమే ఈశ్వరాలయానికి వెళ్ళి, శివలింగాన్ని గట్టిగా కౌగలించుకుని, "ఓం నమశ్శివాయ, ఓం నమశ్శివాయ....." అని నామస్మరణ చేస్తూ కూర్చున్నాడు. అర్థరాత్రి సమయంలో యముడు వచ్చి మార్కండేయునిపై తన పాశం విసిరాడు. ఆ సమయంలో మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకుని ఉండడంచేత యమపాశం ఈశ్వరునిపై కూడా పడింది. తక్షణమే ఈశ్వరుడు ప్రత్యక్షమై "ఓయముడా! నాపై కూడా పాశం వేసేటంత ధైర్యం ఉందా నీకు!" అని అతనిని భస్మం చేశాడు. ఈ విధంగా, మార్కండేయునికి రావలసిన చావు యమునికి పోయింది: యముని యొక్క చిరంజీవత్వం మార్కండేయునికి వచ్చింది. కనుక, దై వస్పర్శచేత, దైవానుగ్రహంచేత దైవప్రార్థన చేత మీరు ఎటువంటి కర్మలనైనా మార్చుకోవచ్చును. అందుచేత, దైవాన్ని నిరంతరం ప్రార్థించడం, స్మరించడం, పూజించడం అత్యవసరం. దైవం ఎక్కడో ప్రత్యేకమైన స్థానంలో లేడు: మీయందే ఉన్నాడు. దేహమే దేవాలయం అట్టి అంతర్ముఖమైన దైవాన్ని మీరు నిరంతరం స్మరిస్తూ రావాలి.
(స.సా.న. 99 పు 286/288)