భగవంతుడు లేడంటే మనవ్వు లేనట్లే. దేవుడు లేడనే వారుకూడా నేను వున్నాను అంటారు. అయితే వున్నాను అనే నేను ఎవరు? శారీరక మానసిక, పరిణామాలలో సుఖదు:ఖాలలో మార్పుచెందకుండా వుండేది నేను. నేను అనేదే దైవం అని నమ్మండి. కళ్లతో చూస్తూ, నాలుకతో రుచి చూస్తూ కాళ్లతో కదులుతూ ఆలోచనలో తర్కిస్తూనే వున్నది ఆ నేను. ఇవి నావేకాని నేను వేరు అనే భావం నిరంతరమూ మెదలుతూవుంటుంది. నాస్తికలు కూడా ముందుగా ఆస్తి అని తరవాత నాస్తి అంటారు. నా +ఆస్తి నాస్తి అవుతున్నది. ఆస్తి లేకుండా నాస్తి అనటానికి వీలులేదు. నేను అనేది ప్రత్యేకం కాదు. పరమాత్ముడనే సముద్రంలో ఒక తరంగం నేను అనే సంకుచిత భావంవల్ల భయమూ దురాశా నిండిన ప్రపంచంలో సంచరిస్తారు. నాయిల్లూ నావూరూ, నా కులం, నామండలం, నాభాష అనే చిక్కువలలో బిగిసిపోయి బైట పడలేరు.
(వ.1963 పు. 164)