ఇంక ఆవరణము. అద్దము పైన దట్టమైన బట్టను కప్పినప్పుడు అందులో మన ప్రతిబింబము కనుపిస్తుందా? ఏమాత్రము కనుపించదు. మలముచేత స్వస్వరూపాన్ని మాలిన్యముగా చూస్తున్నాము. చంచలత్వము నేచర్ అనుకుంటున్నాము. నేను Human body కనుక యిది. సహజమనుకుంటున్నాము. సమర్థించుకుంటున్నాము. విద్యార్థులారా! మనము చేసేది. అనుభవించేది ఆనందించేది యివన్నీ Reflection, Reaction and Resound, Reality ఒకటి ఉంటున్నది. ఆ Reality ని మరిచిపోతున్నాము. Reaction అనుసరిస్తున్నాము. Resound ను వింటున్నాము. Reflection ను చూస్తున్నాము.
ఈ అద్దము దట్టమైన బట్టతో మూయబడింది. ఏ బట్ట? కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములనే అరిషడ్వరములనే బట్ట. ఇవి మానవ దేహమునకు కొంత సహజములే. అయినప్పటికి భుజబలమదము, ధనమదము, విద్యామదము కులమదము, ఐశ్వర్యమదము, సొందర్యమదము, యౌవన మదము, తపోమదము ఇలాంటి అష్ట మదముల చేత ఈ అద్దము కప్పబడి వుంటున్నది. ఈ బలము ఎంతవరకు వుంటుంది? చెప్పటానికి వీలు కాదు. మన యౌవనము ఎంతసేపు వుంటుంది? మించునట్టుగా ఒక్క నిమిషము లోపల మారిపోతుంది. మన విద్యా మదమా? నీకంటె గొప్ప విద్యావంతులు లోకములో ఎంతమంది లేరు? నీ విద్య వారి దానిలో ఎంత? ఇవన్నీ విచారణ చేస్తే మదమునకు ఏమాత్రము అవకాశము లేదు. ఇది భ్రాంతి; భ్రమ. "చదువుల్ నేర్చితి నంచు గర్వము వహించన్ రాదు, నీకున్న ఆ చదు వేపాటిది విద్యకున్ వినయమే స్వస్వరూపము", మానవుని యందు వినయము రావాలి. విద్యార్థులయందు వినయ విధేయతలు లేక పోవటం చేతనే మదము తలకెక్కుతున్నది. ఈ అష్టమదములు మానవత్వమున మరుగుపరచే దుష్ట గుణములు. ఈ మదములే మనస్సనే అద్దమును కప్పిపుచ్చినవి. ఈ దట్టమైన బట్టను తీసివేయాలనుకుంటే ప్రేమను పెంచుకోవాలి. ఈ ప్రేమనే ప్రధానము. అదే ప్రత్యక్ష పరమాత్మ. Love is God. Live in Love ఈ పవిత్రమైన ప్రేమచేతనే సర్వులను ఒక్క రీతిగా కట్టుకోవచ్చును.
(బృ.త్ర.పు. ౮౫)