వైరాగ్యమంటే ఆలుబిడ్డలను వదలిపెట్టి అడవికి పోవడం కాదు. "భావమందు దుష్టభావంబు వీడుటే త్యాగమగును. అదియే యోగమగును". కోరికలను ఎంత తగ్గించు కొంటావో నీవు అంత ఆనందమును అనుభవిస్తావు.
(స.సా.ఆ.99 పు.273)
వైరాగ్యం అంటే కర్మలు విసర్జించటం కాదు. ఇల్లు వాకిలి విడిచి అడవి గుహలో నివసించటం కాదు. కేవలం కర్మ త్యాగం ఎన్నటికీ వైరాగ్యం అనిపించుకోదు. విషయ వాంఛలు తగ్గించుకోటమే వైరాగ్యం అనిపించుకొంటుంది. వైరాగ్యలబ్ధకి రామాయణాది గ్రంథాలు తోడ్పడతాయి. రాముడు త్యాగ పురుషుడు. "త్యాగేనైకే అమృతత్వ మానశు" అధికారం పొందటానికి సర్వశక్తి సామార్థ్యాలు ఉండిన ను దానిని త్యాగం చేశాడు. ఆనాడు రాముడు."
(అ.త.పు. 126)
వైరాగ్యము అనగా శబ్దాది విషయాలలో అనురక్తి వుండరాదు. ఇంద్రియములు వాటికి తగినవే కోరును కానీ సాదకునకు తగినవి. అవి కోరవు. కాన ఇంద్రియార్ధములు పురుషార్ధములుకావు. ఆత్మకు కావలసినవే పురుషార్ధములు.
(గీ.పు.209)
మీరందరూ యీ శిక్షణా కేంద్రమునకు బయలు దేరేముందు తక్కువ luggage తో వచ్చారు. ఎందుకు? మీకు దారిలో పడవలసిన శ్రమ తెలుసును కనుక. కానీ మీరు రెండు బుట్టలు, రెండు ట్రంకులు, ఒక బెడ్డింగు ఇలా సామానులు ఎక్కువగాతెస్తే మీ ప్రయాణము సుఖముగా ఉండదు. దిగవలసిన stationలో రైలు చాలా కొంచెము సేపు మాత్రమే నిలిచినప్పుడు ఇవన్నీ దింపుకొనే లోపల బండి కదిలి పోతుంది. నా సామానులు పోయినవి అని బాధపడుతుంటారు. అందుకేRailway Department Less luggage, more comfort, make travel a pleasure అని వ్రాసి పెట్టారు. మన జీవితము కూడ ఒక దీర్ఘ ప్రయాణము. ఈ వాంఛలే Luggage. దీనిని తగ్గించుకోవాలి. ఈ కోరికలను తగ్గించుకోవడాన్నే వేదాంత పరిభాషలో వైరాగ్యమన్నారు.వైరాగ్యమంటే ఇల్లు, వాకిలి, ఆలుబిడ్డలను వదలి ఆరణ్యమునకు పోవడం కాదు. ఇది సరైన అర్థము కాదు. వైరాగ్యమనగా ఆశలను అదుపులో పెట్టు కోవడమే, నీవు సంసారములో ఉండు. సంసారమును నీలోనికి చేర్చకు - Hands in the Society, Head in the forest" అనే తత్వమును మనము పెంపొందించు కోవాలి. పిల్లల తల్లిదండ్రులకు కూడ బోధించాలి. మీరు ఆచరణ రూపేణ అందిస్తే వారు కూడ మారడానికి అవకాశం ఉంటుంది.
(శ్రీది.పు.117/118)
అభిమానమే దుఃఖమునకు మూలకారణము. కనుకమొట్టమొదట ఈ అభిమానమును క్రమక్రమేణ మనం తగ్గించుకుంటూ రావాలి. దీనినే వేదాంత పరిభాషల యందు వైరాగ్యము అని చెబుతారు. ఈ బాధ్యులను క్రమక్రమేణ తగ్గించుకుంటూ రావాలి. దీనినే less luggage more comfort make travel a pleasure మన ప్రయాణము లోపల ఈ లగేజ ను తగ్గించుకుంటూ రావాలి. అయితే ఏ విధంగా తగ్గించుకోవాలి? ఈ వాంఛలు లేకుండా మానవుడు జీవించడానికి వీలుకాదే! ఈ వాంఛలు ఏవిధముగా మనము తగ్గించుకోవడానికివీలవుతుంది? వాంఛలు తగ్గించుకోవడమంటే వాంఛలపై నున్న మమత్వాన్ని తగ్గించుకోవడము. నీ వ్యాపారము. నీవు చేసుకో, నీ ఉద్యోగానికి నీవు వెళ్ళు. నీ కర్తవ్యాలు నీవు నిర్వర్తించు, నీ బాధ్యతలు నీవు అనుసరించు, ఆచరించు, అనుష్టించు కాని ఇవన్నీ కూడనూ భగవత్ కార్యములే అనే భావనతో నీవు అనుభవించాలి. "సర్వ కర్మ భగవత్ ప్రీత్యార్థం" అనే భావనతో నీవు అనుభవించాలి. ఇది సులభమైన మార్గము. అన్ని భగవంతుడే చేస్తున్నాడు.
(శ్రీ పి. 1955 పు.21)
ఇంద్రియములు వినిన విషయములపైగానీ. చూసినవస్తువుల పై గాని, మనస్సు ఒక విధమైన కాంక్షను దూరము గావించుకోవటమే వైరాగ్యమని నిరూపించింది పతంజలి యోగసూత్రము. విషయస్వరూపమునుండి ఆసక్తిని దూరము చేయుటయే వైరాగ్యమని స్థిరము చేసింది. ఈ లోకమునందు గల వస్తువులుగానీ పరలోకము నందున్న వస్తువులుగాని అనిత్యములని వాటి పైన ఆసక్తి భావమును దూరము గావించుకొని, అట్టి వస్తువుల యెడ వైరాగ్యమును పొందటము అత్యవసరమని ప్రబోధించింది. శంకరభాష్యము.
ఇక శ్రుతి ప్రమాణము. దృశ్యకల్పితమైన దేహము మొదలు బ్రహ్మదేవుని వరకుండిన వస్తువిసర్జనయే - అనగా వస్తువుల పైన రోతయే వైరాగ్యమని బోధించింది.
(శ్రీ. గీ .పు. 91)
వైరాగ్యము, నమ్మిక ప్రేమ అనే స్థంబాల పై శక్తి, ఆధారపడి ఉంటుంది. వీటన్నింటిలో నమ్మకం ప్రధానమైనది. అది లేని సాధన నిష్ప్రయోజనము. కేవలం వైరాగ్యం సాధనను శక్తి వంతం చేస్తుంది. ప్రేమ త్వరిత గతిని భగవంతుని దగ్గరకు చేరుస్తుంది. భగవంతుని యందు నమ్మకము, ఆయనను, వేరైన విరహాగ్నిని వెలుగొందింప చేస్తుంది. భగవంతుడు నీకు ఏది కావాలో, ఏది ప్రాప్తో దానిని అనుగ్రహిస్తాడు. అడుగవలసిన పనిలేదు, గొణుగు కోవడానికి కారణం కనబడదు. తృప్తి అలవరచుకో, ఎప్పుడేది జరిగినా కృతజ్ఞతా భావంతో ఉండు. ఆయన సంకల్పానికి తిరుగు లేదు. - శ్రీ సత్యసాయి బాబా. (నా బాబా నేను పు67)