నానా రూప ప్రపంచము పై వైరాగ్యము కల్గినవారికే అనన్య భక్తి కుదురును. అదే ఆత్మ జ్ఞానము నందించును. సంసారాసక్తమైన చిత్తమునకు వైరాగ్యము నేర్పు నిమిత్తమై ప్రపంచమును ఒక అశ్వత్థముగా చెప్పడమైనది. దీనిని తెలుసుకొన్నవాడే నిజమైన వేదాంతి అని కూడనూ చెప్పవచ్చును. లోకమున సామాన్యముగ ఊర్ధ్వమన్న పై భాగమని తలంతురు. కాని ఈ భగవత్ వాక్యమైన బ్రహ్మాండ వృక్షమునకు బ్రహ్మమే ఊర్ధ్వము. మాయోపాధిక బ్రహ్మము ఈ జగత్తుకు సువిశాలమైనది; సమస్తమునకు బ్రహ్మయే అధిష్టానము. -
(గీ.పు.219/220)
వేదాంతమునందు "బ్రహ్మ సత్యం జగన్మిధ్య" అంటున్నాము. మరొక వైపున "సర్వం విష్ణుమయం జగత్" అని కూడా అంటున్నాము. ఈ రెండింటి లో ఒకదాని కొకటి పొందిక కుదరదే? ఒక దానిని విశ్వసించినప్పుడు మరొక దానిని వివ్వసించడానికి వీలు లేదు కదా అని మీరు అనుకోవచ్చును. కాని వేదాంతమునందు రెండింటిని విశ్వసించవలసిందే! రెండూ సత్యమే. ఎట్లా? బ్రహ్మ సత్యం జగన్మిధ్య" అన్నప్పుడు, స్క్రీన్ (బ్రహ్మ) - సత్యము, బొమ్మలు (జగత్తు) - మిథ్యము. అయితే, ఈ బొమ్మలు వచ్చినప్పుడు స్క్రీన్ ఎక్కడ ఉంటున్నది. ఈ మిధ్యమైన బొమ్మలులోనే సర్యమైన స్క్రీన్ ఉంటున్నది. కాబట్టి, సత్యమైన విష్ణువు మిథ్యమైన బొమ్మలలో కూడా ఉంటున్నాడు. కనుక, "సర్వం విష్ణుమయం జగత్" అన్నది కూడా సత్యమే.
(శ్రీ భ.ఉ.పు.171)
మామూలు వేదాంతమనే పదాన్ని తత్వచింతనకు పర్యాయ పదంగా వాడుతుంటారు. కానీ వేదాంతమనేది వేద వాజ్మయములో ఒక ప్రత్యేకమైన శాఖ. ఉపనిషత్వాజ్మయ మంతా వేదాంతమునకు సంబంధించినదే. బాహ్యసృష్టిలోని అందచందాలను అంతర్దృష్టితో అవగాహన చేసుకొని వాటి అదేశాన్ని అనురాగముతో కీర్తించిన ఆనందగీతికలు ఋగ్వేదములోని ఋక్కులు, పాడుకొని కొనియాడ తగిన పరమరమణీయ పదసంపద సామగానము, ఐహిక ఆముష్మిక రహస్య సంపుటి అధర్వణ రూపాన్ని ధరించినది. సత్కర్మలయిన, పుణ్యకర్మలయిన యజ్ఞయాగాలు కర్మకాండకు సంబంధించిన మంత్రాలు యజర్వేదములో చేరినాయి. ఇలా నాలుగు నాలుగు భాగాల్లో విస్తరిల్లిన వేద వాజ్మయములలో తిరిగి నాలుగు శాఖలు, ఇవన్నియూ విద్యలనబడును. మంత్ర భాగము, బ్రాహ్మణ భాగము, అరణ్యకం, ఉపనిషత్ భాగము. మంత్రభాగాన్ని సంహితాభాగమని కూడా అంటారు. ఇందులో మంత్రాలన్నీ సంగ్రహంగా కూడి వుంటాయి. ఈ మంత్రాలకు వినియోగం, ప్రయోజనం ప్రక్రియ నిరూపించేది బ్రాహ్మణ భాగము. బ్రహ్మశబ్దానికి అనేక ఆర్థము లున్ననూ ఇచట మంత్రమనే అర్థము. ఈ భాగములో యెక్కువగా ప్రవృత్తి మార్గానికి చెందినవి, వైరాగ్య సూత్రాలు వేద రహస్యాలు అరణ్యకములో వుంటాయి. ఈ రెండింటి సమన్వయం చివరిభాగమైన ఉపనిషత్తులలో వుంటుంది. ఇది వేద వాజ్మయానికి తుది విభాగములగుటవల్ల దీనికి వేదాంతమని పేరు వచ్చింది. ఒక విధంగా దీనిని వేదసారమని చెప్పవచ్చు. సమస్త వేదసారస్వతానికి నవనీతము లాంటిది. అనగా పాలను మధించగా పైకితేలు వెన్నవంటిది ఈ వాజ్మయము. ఉపనిషత్ సత్ అనే ధాతువునండి వచ్చినది. ఈ ధాతువుకు "ఉప" "ని" అనే రెండు ఉపసర్గలు చేరాయి. సత్ అనే ధాతువునకు కూర్చుండుట అని యర్థము దీనికే నశింపజేయుట అని కూడా మరొక అర్థమున్నది. "ని" అనగా నిష్ఠను తెలియజేస్తుంది. అనగా ఆచార్య సమీపమున (గురు సమీపము) నిష్టతో కూర్చొని నేర్చుకొన్న వివేక విజ్ఞానాలు అలవడువు. భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రములు భారతీయ తత్వచింతనకు మూలకందములు. వీటినే ప్రస్థాన త్రయములని అందురు.
(వి.వా.పు.2/3)
వేదాంతము అంటే బహుళ గ్రంథపఠనమువలన కలుగు పాండిత్యము కాదు: వాది సింహము, ప్రతివాది భయంకరుడు అనే పేరుప్రతిష్ఠలు కాదు; సంసారమందు, ప్రకృతి ధర్మసంబంధమై సహజముగా కలుగు కష్ట నష్టములను తప్పించు కవచమే వేదాంతము. మంచి, చెడ్డ, ఏది జరిగినా, అన్నీ పరమాత్మ యొక్క సంకల్పమే అనే వివేకము వేదాంతము. అన్నిటిలో చేరిననూ, అన్ని కర్మలనూ నిర్వహించిననూ దేనిలోనూ కర్తృత్వ భోక్తృత్వ భావము లేని వాడు తాను, అనే జ్ఞానమే వేదాంతము.
(అ. శా.పు.40/41)
ఉపనిషత్తులకే వేదాంతము అని పేరు. వేదాంతములు తెలుసుకో కుండా కేవలము వేదములు వల్లెవేసినంత మాత్రమున ప్రయోజనముండదు. అంతియే కాదు. సంపూర్ణ ఫలము కలుగదు.
(లీ.వా.పు.8)
ఈ వేదాంతమనే దానిని విచారణ చేస్తూ పోతే దీనికి అంత్యమేలేదు. వేదాంతము యొక్క సారము ఈ మూడింటి యొక్క ఏకత్వమే. (మనస్సు, వాక్కు, ప్రవర్తన) ఈ మూడింటి యొక్క ఏకత్వమును మనం అనుభవించినప్పుడే నిజమైన ఆనందము. అప్పుడేదైవత్వమనే ఏకత్వము మనకు ఆత్మతత్త్వముగ నిరూపిస్తుంది.
(శ్రీ.ఫి 1995.పు.2)
(చూ|| చైతన్యము, తుంగభద్ర, దమము, వేదము, శ్రద్ధ)