మనము వేదమును - ఋగ్వేదం, యజర్వేదం, సామవేదం అని మంత్రాలలో ఉచ్చరిస్తున్నాము. ఋగ్వేదమనగా ఏమిటి?వాక్కే ఋగ్వేదం. వాక్కు నుండి ఋగ్వేదము ప్రారంభమౌతుంది. ఈ వాక్కు ఏవిధంగా వస్తున్నది? అంతర్భావమైన, మూలాధారమైన నాభి నుండి వస్తున్నది. దీనినే ఋగ్వేదమన్నారు. ప్రాణమునే సామవేదమన్నారు. ప్రాణో పాసన చేత ఒక విధమైన శ్వాసము ప్రారంభమౌతుంది. ఈ శ్వాసము సుస్వరముతో కూడినదై ఉంటుంది. ఇదే నిజమైన సామవేదము. సామగానమనగా ఏమిటి? ప్రాణోపాసన చేత ఆవిర్భవించిన శ్రవణానందమే సామము. గానానందమే సాధన. ఈ సామము సుస్వరమైనదిగా ఉండాలి. సుస్వరం కానిది ఏమాత్రం సామగానము కాదు. ఇంకయజుర్వేదము - యజ్ఞయాగాది క్రతువులందు మంత్రస్వరూపమైనది, తేజోమయమైనది. ఈ ప్రపంచము నందు మనకు కనిపించే సమస్తతేజస్సునూ స్వరూపంగా నిరూపణ చేసి, అది భగవంతుని తేజోమయ స్వరూపమేనని ఋగ్వేదము ప్రపంచానికి చాటుతూ వచ్చింది. సామాన్యంగా మన భారతీయు లందరూ - "భగవంతుడు కోటి సూర్యుల కాంతితో వెలుగొందుచున్నాడు" అని విశ్వసిస్తారు. కనుక తేజస్వరూపమే. ఋగ్వేదము, మంత్రస్వరూపమే యజుర్వేదము, గానస్వరూపమే సామవేదము. మానవునికి ఈ మూడూ అవసరమే. భగవంతుని తేజోమయంగా నిర్మించుకొని మంత్రంతో ఉచ్చరించి గానంలో ఆనందించాలి. కాబట్టి, ఈ ఋగ్వేద యజుర్వేద సామవేదాలన్నీ అనుభవించటానికి వచ్చినవే కాని, కంకణాలు రుద్రాక్షలు ధరింపజేయటానికి కాదు.
(స.సా..ఆ.93పు.273/274)
వేదము, వేదాంతము, వేదజ్ఞుడు సర్వమూ భగవంతుడే. వాక్కులో కూడుకున్నదంతా ఋగ్వేదము, మనస్సులో కూడుకున్నదంతా యజర్వేదము, ప్రాణముతో కూడి ఉన్నదంతా సామవేదము. ఋగ్యుజుస్సామ వేదముల తత్వము వాక్కు, మనస్సు, ప్రాణతత్వమే కనుక సర్వమూ వేదమయమే.వేదస్వరూపుడు పరమాత్ముడు అనంతోవైవేదః " ప్రతి వ్యక్తి వేదస్వరూపుడే. కనుక వాక్కులో తేజస్సును అభివృద్ధి పరచుకోవాలి. ఆదర్శమును అందించే నిమిత్తము బ్రతకాలి కాని ఆశల కోసము కాదు. నిజంగా ఏ మానవుడు కూడా సర్వసంగ పరిత్యాగిగా కానరావటం లేదు. దైవార్పిత భావమే సర్వసంగా పరిత్యాగము. కాని ఎక్కడున్నది దైవార్పిత భావము? దైవార్పిత భావమే ఉంటే జగత్తు దు:ఖములతో ఆశాంతిలో నిండిపోయేదే కాదు.
"సత్యం భ్రూయాత్ ప్రియం భూయాత్నభ్రూయాత్ సత్యమ ప్రియం" సత్య పాలనకు నియమములున్నాయి. ఉద్రేకము ఉండకూడదు. అప్రియమైన సత్యాన్ని చెప్పకూడదు. ప్రియమని అసత్య మాడకూడదు; ఇట్టి నియమములను పాటిస్తూ సత్యమే దైవంగా భావించి కర్తవ్యములను నిర్వర్తించాలి.
(జ.పు.159)