రామచంద్రుడు ఆ నావికునకు వేతనము నిచ్చుటకు తనచెంత చిల్లిగవ్వయైననూ లేనందున చాల సిగ్గు పడినటుల నటించెను. రామహృదయమును యెరిగిన జానకి తన వ్రేలియందలి ఉంగరమును తీసి రామహస్తముల యందుంచెను. రాముడు, ఓయీ! నావికా, ఇదిగో నీ వేతనము, పుచ్చుకొనుమని పలికెను. అంత నావికుడు రామచంద్రుని పాదములపై బడి "రామా! రామా! ఈనాడు నా జన్మ సాఫల్యమయినది. నా సర్వపాపములు పటాపంచలయినవి. నా భవరోగము తీరినది. అనేక జన్మలుగా శ్రమపడుచుండిన నా శ్రమకు నేడు నా విధాత నాకు ప్రాప్తించి, నా వంశమునే తరింపజేసితిరి. నాధా, మీ అనుగ్రహ మొక్కటుండిన చాలును. తిరిగి తమరు వచ్చునపుడు నన్ను మరువక ఇట్టి సేవ నాకు కటాక్షించిన ధన్యుడనయ్యెదను" అని పాదములపై బడి ఆనందబాష్పములతో ప్రార్థించెను. అంత రామలక్ష్మణులు పలువిధముల ఆ నావికుని ఓదార్చి బోధించి వేతనమును పుచ్చుకొమ్మని నచ్చజెప్పిరి. అయితే ఆ నావికుడు స్వామీ! రామచంద్రా,నేను మిమ్ముల నొక్కరినీ ఈ చిన్న గంగానది దాటించినందుకే నేను వేతనము పుచ్చుకొన్న తమరు కోట్లకు కోట్లు నా తరము వారలను నాతోటి మానవులను సంసార ప్రవాహమును దాటించి మోహసాగరముమ దాటించుచున్నారే, ఇందుకుతమరేమి వేతనమును పుచ్చుకొనుచున్నారు?ఈ స్వల్ప కార్యమునకు నేనెంతో అదృష్టవంతుడనని ఆనందించుచుండ, నా ప్రాప్తిని దూరము చేయుట తమకు భావ్యము కాదు, రామా, అని దీనుడై ప్రార్థించెను. రాముని హృదయము కరిగి అతనిని తొందర పెట్టుట మంచిది కాదని తలంచి హృదయ పూర్వకంగా ఆశీర్వదించి అతనిని దీవించి పంపెను.
(రా.వా.మొ. పు. 274/275)