ఒకానొక సమయంలో బృందావనంలో గోపికలు, గోపాలురు కృష్ణుని చుట్టూ చేరినారు. అందులోను ఈ గోపికలు పిచ్చివారు. ఏ పిచ్చి?భగవంతుని పిచ్చి,కాని, నేటి పండితులు దీనిని అర్థం చేసుకోలేక అసభ్యకరమైన, అమర్యాదరకమైన విషయాలను ప్రబోధిస్తూ వస్తున్నారు. గోపికల ఆటపాటలయందు ఆధ్యాత్మిక తత్త్వమే ఇమిడియుంటున్నది. కించిత్తైనా లౌకికము వారిలో కనిపించదు. ఒక గోపిక అన్నది. "కృష్ణా! నీ వేణుగానమును మేము వినాలి. నీ వేణుగానములోని నాదమే మాకు ప్రాణము. అదే మా జీవితము."
"పాట పాడుమా కృష్ణా!
పలుకు తేనెలొలుకు నటుల
మాటలాడుమా ముకుంద
మనసు తీరగా....
వేదసారమంత తీసి
నాదబ్రహ్మముగను మార్చి
వేణునందుతిరుగబోసి
గాన రూపముగను మార్చి
పాటపాడుమా కృష్ణా!"
ఇందులో ఏవిధమైన లౌకిక భావమూ లేదు. "ఎన్నో వేదము లున్నవి. స్త్రీలమైన మేము ఎన్ని చదువగలం? ఈ వేదములు మాకేమీ తెలియవు. వాటి సారము నంతా సూక్ష్మంగా మా కందించు. బ్రహ్మ నాదస్వరూపుడు. కనుక, వేదసారము నంతా తీసి నాద బ్రహ్మముగా మార్చి వేణువునందు తిరుగబోసి మాకు అందించు" అన్నారు. ఎంతటి దివ్యమైన భావములు చేరాయి ఆ గోపికలలో!
(స. సా.ఆ.95 పు.265)