ఒకానొక సమయంలో ఒక శిల్పి భోజరాజు వద్దకు మూడు విగ్రహాలను తీసుకు వచ్చాడు. ఆ మూడు విగ్రహాలు చూడటానికి ఒకే మాదిరి కనిపించాయి. భోజరాజు మంత్రిని పిలిచి "మం త్రీ! ఈ మూడు విగ్రహాలలో ఏది శ్రేష్టమైనదో చెప్పగలరా? అని అడిగాడు. మంత్రి ఒక ఇనుప తీగను తెప్పించి దానిని మొదటి విగ్రహం యొక్క చెవిలో దూర్చాడు; ఆది రెండవ చెవిద్వారా బయటికి వచ్చింది. "ఇది శ్రేష్టమైనది కాదు", అని దానిని ప్రక్కన పెట్టాడు. ఆ ఇనుప తీగము రెండవ విగ్రహం యొక్క చెవిలో దూర్చగా అది నోటి నుండి బయటకి వచ్చింది. "ఇది మొదటి విగ్రహంకంటే కొంత మేలుగాని, శ్రేష్టమైనది. కాదు." అన్నాడు. ఆ తీగను మూడవ విగ్రహం చెవిలో పెట్టేట్పటికి ఆది లోపలికి పోయింది. "ఇదే శ్రేష్టమైనది", అన్నాడు. దీని అంతరార్థమేమిటి? మొదటి విగ్రహము ఒక చెవితో విని మరొక చెవితో వదలి పెట్టేవారికి చిహ్నము. అలాంటివారు అధములు. రెండవ విగ్రహము - విన్న విషయాలను అనుభవించకుండా కేవలం మాటలలో చెప్పేవారికి చిహ్నము. ఆలాంటివారు మధ్యములు. ఇంక, మూడవ విగ్రహము - విన్న విషయాలను హృదయంలో చేర్చుకుని ఆచరించి అనుభవించేవారికి చిహ్నము. అలాంటివారే ఉత్తములు. మీరందరూ అలాంటి ఉత్తములుగా, ఆదర్శమూర్తులుగా తయారు కావాలి.
స. సా. జాన్ 2000 పు. 186)