విశ్వామిత్రుడు గొప్ప తపఃసంపన్నుడు. అనేక అస్త్ర శస్త్రములను సాధించినవాడు. కానీ కోపముచేత సర్వమునాశనము చేసుకున్నాడు. వశిష్ఠులవారు బ్రహ్మర్షి. నిరంతరము బ్రహ్మతత్వాన్ని చింతించే వాడు. విశ్వామిత్రుడు రజోగుణముతో ఉండేవాడు, రాజర్షి, అతను బ్రహ్మర్షి. ఇతను రాజర్షి. తాను కూడా బ్రహ్మర్షి కావాలని పట్టుబట్టాడు విశ్వామిత్రుడు. తపస్సు చేశాడు. ఆలాంటి విశ్వామిత్రుడు వశిష్ఠులవారిపై క్రోధము పూనటం చేత సర్వశక్తులు కోల్పోయాడు. మీకు తెలుసు. దూర్వాసుడు కూడా గొప్ప తపస్పంపన్నుడే. కానీ అతనికి కోపము ముక్కు పైనే ఉంటుంది. అతని దగ్గర శాంతము,ప్రేమ కనిపించవు. ప్రయోజనం ఏమిటి? మహర్షి ఆయినందుకు మధురమైన వాక్కులు, పవిత్రమైన నడత ఉండాలి. అప్పుడే మహత్తరమైన శక్తి కీర్తి వస్తుంది. .
(ద. స..98పు.42)
విశ్వామిత్రుడు గాయత్రీమంత్రమును కనిపెట్టెను. ఇది సూర్యశక్తికి సంబంధించినది. ఇది మహాశక్తివంతమైనది. మహామంత్రము. దీనిలో అత్యద్భుతమైన శక్తి యున్నది. ఆదిత్యహృదయం అన్న విద్యద్వారా విశ్వామిత్రుడు రామాయణములో రాములకు సూర్యశక్తి రహస్యాలను వివరించినట్లు రామాయణ పాఠకులకు విదితమే! ఆ మంత్రాన్ని ఉచ్చరించి భక్తి శ్రద్ధలతో విశ్వసించి అపూర్వమైనఅస్త్రాలను సంపాదించి మహా సంపన్నుడైనాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు ఈ శక్తి ద్వారా సృష్టికి ప్రతిసృష్టి చేసిన గొప్ప వైజ్ఞానికుడు. వైజ్ఞానికుడన్న కేవలము భౌతిక యంత్రాంగములతో అద్భుత శక్తిని కనిపెట్టువాడు కాడు. ఆధ్యాత్మిక శక్తిని ఆధారము చేసికొని మంత్రద్రష్టుడై సాధనలు సలిపి శ్రద్ధాభక్తితోనిత్యాచరణలో ఈశక్తిని నిత్యానుభూతికి తెప్పించుకోగలిగిన వానినే పూర్వము వైజ్ఞానికుడని పిలచెడివారు. అయితే ఈనాటి వైజ్ఞానికులు అంతో యింతో చదివి తెలిసికొని దానిని కొండంతచేసి ఆడంబరములతో అత్యద్భుతశక్తిని సంపాదించితిమని ఆహంకారముతో ఆకాశానికి ఎగురుచున్నారు.
(స.వా. పు. 157/158)
బలిచక్రవర్తి గుణములందు కూడా మహాబలుడే. కనుకనే అతనికి “మహాబలి" అని పేరు వచ్చింది. అలాంటి చక్రవర్తిఏలిన కేరళా సామాన్యమైన ప్రదేశం కాదు. ప్రపంచ పటంలో అది చాలా చిన్నదిగా కనిపించవచ్చు. కాని, అది భగవంతుడు వామన మూర్తిగా అవతరించిన పవిత్రమైన ప్రదేశం. విశ్వామిత్రుడు యాగము చేసినది అక్కడే. "ఓం భూర్భువస్సువ....." అంటూ మహాపవిత్రమైన గాయత్రి మంత్రమును బోధించినది అక్కడే. ప్రపంచమంతటా ఈ మూడే ఉన్నాయి. "భూ?" - అనగా మెటీరియలైజేషన్ - మెటీరియలైజేషన్ - దేహతత్త్వం. వైబ్రేషన్ - జీవతత్వం. ఇంక, రేడియేషన్ - దైవత్వం. ఈ మూడూ మానవునియందే ఉన్నాయి. కనుకనే, నేను అప్పుడప్పుడు చెబుతుంటాను. "నీవు ఒక వ్యక్తి కాదు. నీలోముగ్గురున్నారు. 1 నీవనుకునే నీవు (దేహం). 2. ఇతరులనుకునే నీవు (మనస్సు). 3. నిజమైన నీవు (ఆత్మ). ఈ సత్యాన్ని గుర్తించినప్పుడే నీవు నిజమైన మానవునిగా రూపొందుతావు." దేహము పై మమకారమును పెంచుకోకూడదు. అయితే, ఉన్నంతవరకు దీనిని కాపాడుకోవాలి. కర్మమార్గమునకు దేహం ఆధారం. ఉపాసనకు మనస్సు ఆధారం. జ్ఞానమునకు హృదయం ఆధారం. ఈ మూడింటి ఏకత్వాన్ని గుర్తించాలి.
(స.సా. అ. 2001 పు. 294)
(చూ! కామక్రోధలోభములు,బింబము-ప్రతిబింబము,బ్రహ్మర్షి, మాయ, వాల్మీకి, సీతతత్వము, సీతా కళ్యాణము, స్త్రీహత్య)