పట్టుదలనూ శ్రద్ధనూ యముడు గ్రహించి ఆత్మజ్ఞానమునకు నచికేతుడర్హుడని నిశ్చయించి, నాయనా! శ్రేయస్సు అనియు ప్రేయస్సు అనియు రెండు పురుషార్థములు. అవి రెండును పురుషుని బంధించునవియే. శ్రేయోమారము నవలంబించువాడు శుభమును పొందును. ప్రేయోమార్గమునవలంబించు వాడు పరమ పురుషార్థము నుంచి విదూరుడగును. ఈ రెండును విభిన్నములు. రెండునూ పురుషాధీనములే, ఒకటి వివేకముచే లభించును మరియెకటి అవివేకముచే లభించును. విరుద్ధములగుటచే, అవి ఒక దానినొకటి త్రోసివేయును. ఒకటి మోక్షకారణము: రెండవది సంసారహేతువు. ప్రేయోమార్గము అవిద్యాకల్పిత మనియు, శ్రేయోమార్గము విద్యాకల్పితమనియు, అయితే, శ్రేయస్సును కోరువారు చాల అరుదనియూ యముడు చెప్పెను. ఆత్మ వికల్పరహితమగు అఖండరస ఘనస్వరూపము కనుక, అతను అస్తి నాస్తి, కర్త అకర్త మొదలగు వికల్పముల కాస్పదుడు కాడు; అతను ఙ్ణేయవస్తువు కాడు. కనుక అతనిని గూర్చి జ్ఞాతృ, జ్ఞానఙ్ణేయ భేదము లేదు. ఇదియే ఆత్మజ్ఞానము యొక్క పరాకాష్ఠ. ఉపదేశికుడే బ్రహ్మము. శ్రోతయే బ్రహ్మమని తెలియుచున్నది. ఈ విధమగు జ్ఞానము, సర్వసంసారనివారకమగుటచే జన్మ రాహిత్యము నిశ్చల మగుచున్నది. శ్రుతిసమ్మతము కాని, కేవలము తర్కమునకీ పరమ రహస్యము అందదనియూ, సాధ్యము కాదనియూ, కఠోపనిషత్తు తెలుపుచున్నది.
(ఉ.వా.పు. 16/17)