ఐకమత్యము, సహనము, సానుభూతి, సమగ్రత, సౌభ్రాతృత్వము అనేవి విశ్వకుటుంబములోనే సాక్షాత్కరిస్తాయి. వీరి కుటుంబములో ఈశ్వరుడు, పార్వతి, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యం అని నలుగురు ఉన్నారు. ఈ నలుగురూ చేరి ఏకత్వంగా ఉంటున్నారు.ప్రాకృత రీతిగా మనం విచారణ చేసినప్పుడు - ఈశ్వరుని వాహనము ఎద్దు, పార్వతి వాహనము సింహం. సాధారణంగా సింహమునకు ఎద్దుకు పరమవిరోధం ఉంటుంది. కాని, విశ్వకుటుంబంలో ఈ రెండూ విరోధం లేక ఐకమత్యంగానే ఉంటున్నాయి.
"శిఖములో మున్నీటి కన్య
ముఖములో మూడవ కన్ను
సొగసుగ రుద్రాక్ష మాలలు నిగ నిగ
మెరయగ శివుడు తాండవ కేళి సల్పెనే:
పరమేశ్వరుడు శ్రీ సాంబశివుడు
తాండవ కేళి సల్పెనే!"
శిరస్సు పైన గంగ, ముఖములో అగ్ని ఉంటున్నవి. సాధారణముగా అగ్ని గంగకు విరుద్ధము. కాని, ఈశ్వరునివద్ద వీరు ఎట్టి విరోధాలనూ నిరూపించక ఉంటున్నారు. అంతేకాదు.
"నారదుడు తుంబుర మీటగ - జటా
ఝూటము శిరమున మెరయగ
త్రిశూలంబును త్రిప్పుచు హరుడు”
"తథిం తధిం తోం తకిట" యనుచు తాండవ కేళి సల్పెనే...!
సరస్వతి వీణ మీటగ - పురందరుడు వేణువు ఊదగ - హరి మృదంగము వాయించగ - ధిమి ధిమి ధిమితక యనుచు తాండవ కేళి సల్సెనె...! గౌరీదేవి జగముల నేలగ - గంగాదేవి నదులై పారగ - విఘ్నేశ్వరుడు అటు ఇటు తిరుగు - అవిఘ్నముగ ఆడెను హరుడు తాండవ కేళి సల్సెనే!
ఒక దాని కొకటి విరుద్ధమైన వాటి నన్నింటినీ ఏకత్వం గావిస్తూ వస్తున్నాడు. ఈశ్వరుడు. విఘ్నేశ్వరునిది గజ శిరస్సు, అతని తల్లి వాహనము సింహము. సహజంగా సింహము స్వప్నంలో వచ్చినా ఏనుగు బ్రతక లేదు. అంత విరుద్ధమైనవి కూడా ఈ కుటుంబములో సన్నిహితంగా మెలగుతూ వస్తున్నాయి. ఇంక సుబ్రహ్మణ్యుని వాహనం నెమలి, ఈశ్వరుని ఆభరణములు సర్పములు. ఇవి కూడా ఒక దానికొకటి పరమ విరుద్ధమైనవి. కాని, ఈ కుటుంబములో ఇవన్నీ కలసి మెలసి పెరుగుతున్నాయి. ఇవన్నీ లోకానికి ఆదర్శము నందించే చిహ్నాలే! విఘ్నేశ్వరునిమొలకు సర్పము ఉంటున్నది. సుబ్రహ్మణ్యము యొక్క వాహనము నెమలి. సాధారణంగా నెమలిని చూస్తే సర్పాలు పరుగెత్తి పోతాయి. ఇంత విరోధం కల్గినవి కూడా ఈశ్వర కుటుంబములో అన్యోన్యమైన సంబంధాన్ని అనుభవిస్తున్నాయి. ఈ విధంగా ఈశ్వర కుటుంబం ఐకమత్యానికి చిహ్నంగా నిలబడి జగత్తునకు ఆదర్శాన్ని చాటుతూ వచ్చింది...
(స.సా.న.93 పు.293)
విశ్వకుటుంబమైన ఈశ్వర కుటుంబము సర్యులకూ ఆదర్శము నందిస్తున్నది. గణపతి యొక్క చిత్తము కాని, సుబ్రహ్మణ్యం యొక్క భావము కాని, పార్వతి యొక్కహృదయము కాని, ఈశ్వరుని యొక్క తత్త్వము కానీ, వీటన్నింటిలో ఏకత్వాన్ని ఈ కుటుంబము నిరూపిస్తుంది. సుబ్రహ్మణ్యుడు - బుద్ధి, గణపతి - సిద్ధి, పార్వతి - ప్రకృతి (Matter) ఈశ్వరుడు - శక్తి (energy) ఈ Matter, energy రెండింటి ఏకత్వం చేతనే బుద్ధి, సిద్ధి రెండూ లభ్యమౌతున్నాయి. ఈ ఏకత్వాన్ని మనం చక్కగా గుర్తిస్తే - నాలుగూ చేరి ఒక్కటే కాని వేరు వేరు కాదు. మన చేతిలోని వేళ్ళు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. కాని, పనిచేసే సమయంలో ఈ ఐదూ ఏకమై పోతాయి. ఇవి ఏకం కాకపోతే ఏ పనీ చేయలేము. సృష్టి రహస్యం ఈ విధంగా ఉంటున్నది. ఐతే, భగవంతుడు ఈ ఐదు వ్రేళ్ళనూ సమానంగా ఎందుకివ్వకూడదు? అంటే - వ్రేళ్ళన్నీ సమానంగా ఉంటే అసలు మనం పనే చేయలేము. ఆయా పనులకు సంబంధించినట్లుగా వ్రేళ్ళకు ఆ పొడవు, మందము రెండూ వేరువేరుగా ఉంటుండాలి. ఇది దైవ సృష్టి యొక్క రహస్యం. దీనిని విద్యా బుద్ధులతో విచారిస్తే ప్రయోజనం లేదు.
(స. సా.వ.93 పు.295)