వాసుదేవుని సంకల్పములేక ఈ వసుధలో యే చిన్న కార్యము కూడనూ జరుగదను విషయము నాకు నేటికి సంపూర్ణముగా తెలిసినది. తానే సూత్రధారుడై ప్రేక్షకులతో కూర్చొని తాను యెవ్వరికిని తెలియనివానివలే, దాగియుండును. యే పాత్రను యే విధముగా నటింప వలయునని నిర్దేశించెనో ఆ విధముగ ఆ నటుడుచేయక తప్పదు కదా?
ఈ నాటకమునందలి చిత్ర విచిత్రములు ప్రేక్షకుల హృదయములకు మాత్రము మార్పు కలిగించునే కానీ, సూత్రధారునకట్టి భేదము లేమాత్రమునూ కలుగవు కదా? యెప్పుడు, ఎవరిచేత, యేమి చేయించ, తలంచునో అప్పుడు వారికట్టి బుద్ధి పుట్టించును.
( పు.60 )
అతని ఆజ్ఞలేక యే వక్కటియునూ జరుగదు. లేక అతని ఆజ్ఞను ఉల్లంఘించి పోవలెనన్ననూ అది సాధ్యము కాదు. తాను నేర్పిన నటనను నిమించిన కాలమును, ఈ ప్రకృతి రంగమున అతడు చెప్పినట్లాడక తప్పదు; చేయక తప్పదు, జరుగక తప్పదు కదా? ఇవి మన ఊహాభావములు కాని, అన్నింటికీ అతని సంకల్పము మూల కారణములై కార్యమును జరిపించును.
(భా.వా.పు.60)